Share News

జడ్పీ పోరు

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:37 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది.

జడ్పీ పోరు

నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

21వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరణ

వచ్చే నెల మూడో తేదీన పోలింగ్‌

ఐదో తేదీన ఓట్ల లెక్కింపు

జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలు

మొత్తం ఓటర్లు 1,62,407 మంది

203 పోలింగ్‌ కేంద్రాలు

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. జిల్లాలోని నాలుగు (ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం) మండలాల పరిధిలో నాలుగు జడ్పీటీసీలు, 53 ఎంపీటీసీ పదవులకు ఈనెల 21వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జడ్పీటీసీ పదవులకు జిల్లా పరిషత్‌ కార్యాలయం, ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేశారు. వచ్చే నెల మూడో తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. రిటర్నింగ్‌ అధికారిగా జడ్పీ సీఈవో నారాయణమూర్తి వ్యవహరిస్తారు. ఆనందపురం మండల రిటర్నింగ్‌ అధికారిగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు జిల్లా అధికారి ఆర్‌.పూర్ణిమాదేవి, భీమిలికి భీమిలి డీడీవో రమేష్‌నాయుడు, పద్మనాభం మండలానికి డీఆర్‌డీఏ పీడీ బి.లక్ష్మీపతి, పెందుర్తికి విశాఖ డీడీవో ఉషారాణిని నియమించారు. వీరంతా ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.

జిల్లాలోని నాలుగు మండలాల్లో 1,62,407 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 79,630 మంది, మహిళలు 82,777. ఆనందపురం మండలంలో 51,951 (పురుషులు 25,599, మహిళలు 26,352), భీమిలి మండలంలో 36,943 (పురుషులు 18,098, మహిళలు 18,845) మంది, పద్మనాభం మండలంలో 42,388 (పురుషులు 20,750, మహిళలు 21,638) మంది, పెందుర్తి మండలంలో 31,125 (పురుషులు 15,183, మహిళలు 15,942) మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెల మూడో తేదీన పోలింగ్‌ నిర్వహించి, ఐదో తేదీన ఓట్లు లెక్కిస్తారు.

మొత్తం 203 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 1,462 మంది సిబ్బందిని నియమించారు. వెయ్యి ఓట్లు దాటిన పోలింగ్‌ కేంద్రాలు 16 ఉన్నాయి. వెయ్యి ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఆరుగురు, అంతకంటే తక్కువ ఉన్న చోట్ల ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్‌కు 406 బ్యాలెట్‌ బాక్సులు అవసరమని గుర్తించగా 480 బాక్సులను సిద్ధం చేసి మండలాలకు పంపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని జడ్పీ సీఈవో, ఆర్వో పి.నారాయణమూర్తి తెలిపారు. ఎన్నికల సామగ్రిని మండలాలకు పంపామని ఆయన వివరించారు.

Updated Date - Oct 19 , 2026 | 01:37 AM