Share News

చోరీ బైక్‌లపై... రయ్‌.. రయ్‌!

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:07 AM

నగరంలో బైక్‌ రేసింగ్‌లపై పోలీసులు పటిష్ట నిఘా పెడుతుంటే... రేసర్లు మరో పంథాతో సులువుగా తప్పించుకుంటున్నారు. వ్యక్తిగత వాహనాలతో రేసింగ్‌లకు దిగితే పట్టుకోగానే వివరాలు తెలుస్తుండడంతో చోరీ చేసిన వాహనాల రూపురేఖలు, నంబరు ప్లేట్లు మార్చి రేస్‌లకు దిగుతున్నారు. పోలీసులు తనిఖీలకు వస్తే వాహనాలను వదిలేసి పరారవుతున్నారు. తీరా బైక్‌ నంబరుతో వివరాలు ఆరా తీస్తే... అవి ఎక్కడో చోరీకి గురయినట్టు తేలుతోంది.

చోరీ బైక్‌లపై...  రయ్‌.. రయ్‌!
మధురవాడ లాకాలేజీ రోడ్డులో రేసింగ్‌కు పాల్పడుతున్న యవకులు

నగరంలో రేసర్ల నయా పంఽథా

చోరీ చేసిన వాహనాలతో దూసుకుపోతున్న వైనం

పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి

బైక్‌లు వదిలేసి పరారవుతున్న రేసర్లు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో బైక్‌ రేసింగ్‌లపై పోలీసులు పటిష్ట నిఘా పెడుతుంటే... రేసర్లు మరో పంథాతో సులువుగా తప్పించుకుంటున్నారు. వ్యక్తిగత వాహనాలతో రేసింగ్‌లకు దిగితే పట్టుకోగానే వివరాలు తెలుస్తుండడంతో చోరీ చేసిన వాహనాల రూపురేఖలు, నంబరు ప్లేట్లు మార్చి రేస్‌లకు దిగుతున్నారు. పోలీసులు తనిఖీలకు వస్తే వాహనాలను వదిలేసి పరారవుతున్నారు. తీరా బైక్‌ నంబరుతో వివరాలు ఆరా తీస్తే... అవి ఎక్కడో చోరీకి గురయినట్టు తేలుతోంది.

ఇటీవల దండుబజార్‌ నుంచి జగదాంబజంక్షన్‌ వైపు ఓ కేటీఎంబైక్‌ భారీ శబ్దంతో దూసుకువస్తుండడంతో ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆపేందుకు యత్నించారు. బైక్‌ నడుపుతున్న యువకుడు తప్పించునేందుకు యత్నించగా, వెంబడించి పట్టుకున్నారు. బైక్‌ నంబరు ఆధారంగా సేకరించిన వివరాలు పొంతనలేకపోవడంతో చాసీ నంబర్‌ ఆధారంగా ఆరా తీయగా విజయనగరం జిల్లా భోగాపురం వద్ద చోరీకి గురైన బైక్‌గా తేలింది.’

అదే ఎస్‌ఐ వారం కిందట జగదాంబ జంక్షన్‌లో పల్సర్‌బైక్‌పై దూసుకుపోతున్న ముగ్గురు యువకులను అడ్డుకున్నారు. వివరాలను ఆరాతీస్తే విజయవాడలో చోరీకి గురైన బైక్‌గా తేలింది. దానిని రేసింగ్‌కు వినియోగించేందుకు తెచ్చినట్టు దర్యాప్తులో తేలింది.

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నగరంలో పోలీసులు తనిఖీలను పెంచారు. రేసింగ్‌లకు పాల్పడేవారితోపాటు అపరిమిత శబ్దం, వేగంతో బైక్‌లు నడిపేవారిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జులాయిగా తీరిగే కొందరు యువకులు, వారాంతంలో రేసింగ్‌లకు పాల్పడేవారు, చైన్‌స్నాచింగ్‌లు ఇతర నేరాలకు పాల్పడేవారంతా పోలీసులనుంచి తప్పించుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. నేరం చేసి, పోలీసులకు పట్టుబడితే వాహనం నంబరు ఆధారంగా వివరాలు తెలిసిపోతుండడంతో చిక్కిపోతున్నారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో రోడ్ల పక్కన పార్క్‌చేసిన వాహనాలను అపహరిస్తున్నారు. వాటి నంబరు ప్లేట్లను మార్చడం, లేదా నంబరుప్లేట్‌ లేకుండా చేసి నగరానికి తెస్తున్నారు. వాహనాన్ని గుర్తుపట్టకుండా రంగులు మార్చేసి దర్జాగా రేసింగ్‌లకు, నేరాలకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎక్కడైనా పోలీసులు వాహనాలను ఆపితే వదిలేసి పారిపోతున్నారు. అయినప్పటికీ నేరగాళ్ల వివరాలు పోలీసులకు లభించకపోవడంతో సులభంగా తప్పించుకుంటున్నారు.

చోరీ వాహనాలతో రేసింగ్‌లు

నగరంలో రేసింగ్‌లపై గతంలో పోలీసులు దాడిచేస్తే ఎవరైనా వాహనాలు వదిలేసి పరారైనా, దాని నంబరు ఆధారంగా వివరాలు గుర్తించేవారు. ఇటీవల పట్టుబడిన వాహనాల్లో చోరీవాహనాలే అధికం. గత నెలరోజుల్లో ఏడు చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని నగరానికి చెందిన ఒక పోలీస్‌ అధికారి తెలిపారు. మహరాణిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే 15 రోజుల్లో మూడు చోరీ వాహనాలపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న యువకులను పట్టుకోగా, వారిలో ఒకరు తప్పించుకుని పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. రేసింగ్‌లతోపాటు నేరాలకు పాల్పడేవారు కూడా ఇటీవల చోరీచేసిన వాహనాలను వినియోగిస్తున్నారని పోలీసులే చెబుతుండడం పరిస్థితికి అద్దంపడుతోంది.

Updated Date - Jul 20 , 2026 | 01:07 AM