మన్యంలో వైసీపీ ఆధిక్యం
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:54 AM
మన్యంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలు తమ ప్రభావాన్ని చాటుకుంది. తాజా ఎన్నికల్లో 7 జడ్పీటీసీ స్థానాలు, 85 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. దీంతో జిల్లాలో అధిక మండలాల్లోని ఎంపీపీ పదవులను సైతం వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
- 7 జడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాల్లో విజయం
- మూడు జడ్పీటీసీలకే పరిమితమైన టీడీపీ
- సీపీఎం ఖాతాలో ఒక స్థానం
- కాస్త పుంజుకున్న కూటమి పార్టీలు
- జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులిద్దరూ ఓటమిపాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. జిల్లాలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలు తమ ప్రభావాన్ని చాటుకుంది. తాజా ఎన్నికల్లో 7 జడ్పీటీసీ స్థానాలు, 85 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. దీంతో జిల్లాలో అధిక మండలాల్లోని ఎంపీపీ పదవులను సైతం వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో గిరిజన ప్రాంతంలో ఆ పార్టీకి ఉన్న పట్టు మరోమారు రుజువైంది. కాగా తాజా ఎన్నికల్లో కూటమి పార్టీలు సైతం ఒక మోస్తరుగా పుంజుకోవడం విశేషం. 2021 ఎన్నికల్లో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు 109 వైసీపీ, 26 టీడీపీ, 4 బీజేపీ, 3 సీపీఎం, 2 కాంగ్రెస్, 2 సీపీఐ, 23 మంది స్వతంత్రులు గెలుపొందారు. అయితే తాజా ఎన్నికల్లో వైసీపీ 84 ఎంపీటీసీ స్థానాల్లోనే గెలవగా, టీడీపీ 42, జనసేన 12, బీజేపీ 4 (మొత్తం కూటమి 57), ఇతరులు 19 మంది ఎంపీటీసీ సభ్యులుగా గెలిచారు. గతంతో పోల్చితే మన్యంలో కూటమి ప్రభావం కాస్తా కన్పిస్తున్నది.
పెదబయలులో..
వైసీపీ అభ్యర్థి వంతాల శాంతి తన ప్రత్యర్థి అయిన కూటమి అభ్యర్థి వెచ్చంగి సుశీలపై 4,269 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వంతాల శాంతికి 12,977 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి సుశీలకు 8,708 ఓట్లు లభించాయి.
అనంతగిరిలో..
వైసీపీ అభ్యర్థి దూరు జయవర్ధిణి తన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి పాంగి ఎర్రమ్మపై 2,892 ఓట్ల మెజారిటీతో గెలిచింది. జయవర్ధిణికి 11,837 ఓట్లు రాగా, ఎర్రమ్మకు 8,945 ఓట్లు వచ్చాయి.
గూడెంకొత్తవీధిలో..
వైసీపీ అభ్యర్థి కంకిపాటి గిరిప్రసాద్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన సీపీఎం అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబుపై 4,544 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గిరి ప్రసాద్‌కు 9,737ఓట్లు రాగా, బుజ్జిబాబుకు 5,193 ఓట్లు వచ్చాయి.
చింతపల్లిలో..
వైసీపీ అభ్యర్థి కోరాబు అనూషదేవి గెలుపొందారు. తన ప్రత్యర్థి అయిన అన్నపూర్ణదేవిపై 3,424 మెజారిటీ సాధించారు. అనూషదేవికి 14,799 ఓట్లు రాగా, అన్నపూర్ణదేవి 11,375 ఓట్లు వచ్చాయి.
జి.మాడుగులలో..
టీడీపీ అభ్యర్థి సోమెలి అఖిల తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి ఐసారం మహేశ్వరిపై 75 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.
ముంచంగిపుట్టులో..
సీపీఎ అభ్యర్థి కొర్రా త్రినాథ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రపై 3,426 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. త్రినాథ్‌కు 10161 ఓట్లు రాగా, సుభద్రకు 6735 ఓట్లు వచ్చాయి.
కొయ్యూరులో..
టీడీపీ అభ్యర్థి మెట్టడం హిమబిందు విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవిపై 978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హిమబిందుకు 12,833 ఓట్లు రాగా, మాధవికి 11,855 ఓట్లు వచ్చాయి.
చైర్మన్ రేసులో ఉన్న ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఓటమి
జిల్లాలో జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న వైసీపీకి చెందిన ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థులు గొడ్డేటి మాధవి, జల్లిపల్లి సుభద్ర ఓటమి పాలవ్వడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవీ కొయ్యూరు జడ్పీటీసీ స్థానంలో, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ముంచంగిపుట్టులో పోటీకి దిగారు. అయితే కొయ్యూరులో టీడీపీ అభ్యర్థి మొట్టడం హిమబిందు చేతిలో వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి ఓటమి చెందగా, ముంచంగిపుట్టులో సీపీఎం అభ్యర్థి కొర్రా త్రినాథ్ చేతిలో వైసీపీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర ఓటమి పాలయ్యారు. జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు ఓటమి చెందడం గమనార్హం.