Share News

యువత..దేశ భవిత

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:52 AM

యువతే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని, వారే భవిష్యత్తు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ అన్నారు.

యువత..దేశ భవిత

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు, కార్యకర్తలకు పిలుపు

అనంతరం యువతతో ముఖాముఖి

ఎమ్మెల్యేలతోనూ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

కూటమి నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచన

పార్టీ అగ్రనేతల రాకతో ఉత్తరాంధ్ర శ్రేణుల్లో నూతనోత్సాహం

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

యువతే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని, వారే భవిష్యత్తు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ అన్నారు. జాతీయ అధ్యక్షునిగా నియమితులైన తరువాత తొలిసారి మంగళవారం విశాఖపట్నం వచ్చిన ఆయన తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ దగ్గరున్న వాజపేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి సింహాచలం వెళ్లి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అటు నుంచి పీఎం పాలెంలోని వి కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నిరంతరం ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. వెంకయ్యనాయుడు పార్టీ కోసం గోడలపై పోస్టర్లు అంటించే స్థాయి నుంచి అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ద్వారా అభివృద్ధి పరుగులు తీస్తోందని, ఈ విజయవంతమైన పథకాలలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. భారతదేశం భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నితిన్‌ నబిన్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 945 మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కుమ్మరి, కమ్మరి, యాదవ, గీత ఇలా ప్రతి సామాజిక వర్గానికి పార్టీ అనుసంధానం కావాలన్నారు. ‘అంతా కలిసి పనిచేద్దాం...ప్రతి గ్రామంలో కమలం వికసింపజేద్దాం’ అని నినదించారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చినందుకు, పోలవరం నీరు త్వరగా అందిస్తున్నందుకు ధన్యవాద తీర్మానం చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక మక్కువ చూపిస్తున్నారని, అడిగిన ప్రాజెక్టులు, కోరిన నిధులు ఇస్తున్నారని, అందుకే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని, ఈ విషయాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్లాలని హితవు పలికారు. రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని వి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా సత్కరించారు. ఆ ప్రాంగణంలో 28 జిల్లాల నాయకులతో ప్రత్యేకమైన స్టాళ్లు ఏర్పాటుచేసి ప్రదర్శన నిర్వహించారు. వాటిని జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సందర్శించి ఆయా జిల్లాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ప్రతి జిల్లాకు గుర్తుగా అక్కడ లభించే ఉత్పత్తులను సమావేశానికి వచ్చిన పార్టీ నాయకులకు బ్యాగులో పెట్టి పంపిణీ చేశారు. పలాస జీడిపప్పు, అనకాపల్లి బెల్లం, ఏటికొప్పాక బొమ్మలు వంటివి అందులో ఉన్నాయి. విశాఖపట్నంలో అగ్రశ్రేణి నాయకులతో భారీ సమావేశం నిర్వహించడం వల్ల పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు.

నితిన్‌ నబిన్‌ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత గ్రాండ్‌ బే హోటల్‌కు వెళ్లి అక్కడ యువతతో ‘వికసిత్‌ భారత్‌...యువ సంవాద్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువతతోనే ముడిపడి ఉందన్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అక్కడే రాత్రి ఏడు గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలతో సమావేశం నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్లాలో సూచించారు. కూటమి నిబంధనలకు లోబడి పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీలు సీఎం రమేశ్‌, ఆర్‌.కృష్ణయ్య, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌, రామకృష్ణా రెడ్డి, నడికుడి ఈశ్వరరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పోతుల సునీత, జాతీయ సెల్స్‌ కో కన్వీనర్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్పన్నను దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

సింహాచలం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ మంగళవారం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. నబిన్‌తో పాటు ఆలయానికి చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఇతర నేతలకు దేవస్థానం ఈవో వెంకటరావు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేతల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేశారు. ఆలయంలోని విశిష్ట కప్పస్తంభ ఆలింగనం, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజల తరువాత పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలివ్వగా, ఈవో స్వామివారి ఫొటోలను, ప్రసాదాలను అందజేశారు. అప్పన్నను దర్శించుకున్న వారిలో బీజేపీ జాతీయ సంఘటన్‌ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సహ కార్యదర్శి శివప్రకాష్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఎన్‌.ఈశ్వరరావు, బీజేపీ ఆల్‌ సెల్స్‌ ఇన్‌చార్జి వల్లూరి విష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 12:52 AM