సరియా జలపాతంలో యువకుడి మృతి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:35 AM
మండలంలోని పర్యాటక కేంద్రమైన సరియా జలపాతంలో శనివారం స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు.
స్నానానికి దిగి గల్లంతు
మృతుడు దువ్వాడ విజ్ఞాన్ కాలేజీ బీటెక్ విద్యార్థి
అనంతగిరి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగరంలోని దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలోని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కూర్మన్నపాలెంకు చెందిన తాండ్ర ఫణికుమార్(20), మరో ఐదుగురు స్నేహితులతో కలిసి సరియా జలపాతం అందాలను తిలకించేందుకు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు. వీరందరూ సరియా జలపాతం రెండో స్టెప్ వద్ద సరదాగా గడిపారు. ఫణీకుమార్‌తోపాటు మరో స్నేహితుడు జలపాతం వద్ద ఒడ్డున స్నానానికి దిగారు. లోతుగా ఎక్కువగా ఉండడంతో ఫణికుమార్ నీటమునిగి గల్లంతుకాగా, మరో స్నేహితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు రెండు గంటలపాటు స్థానికులు గాలించగా ఫణికుమార్ మృతదేహం లభ్యమైంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన స్నేహితుడు మృత్యువాత పడడంతో స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందడంతో అనంతగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కె.కోటపాడు ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.