సరియా జలపాతంలో యువకుడి మృతి
ABN , Publish Date - May 29 , 2026 | 10:34 PM
మండలంలోని జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో శుక్రవారం మధ్యాహ్నం స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు.
స్నానానికి దిగి గల్లంతైన యువకుడు
మూడు గంటలపాటు శ్రమించి
మృతదేహాన్ని వెలికితీసిన వలంటీర్లు
అనంతగిరి, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో శుక్రవారం మధ్యాహ్నం స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం గోపాలపట్నం పెట్రోల్ బంక్ ఏరియాకు చెందిన ఇండుగబిల్లి వరప్రసాద్(19), మరో ఇద్దరు స్నేహితులు డి.అభిలాష్, డి.లక్ష్మణ్‌రావులతో కలిసి ద్విచక్రవాహనంపై విశాఖపట్నం నుంచి దేవరాపల్లి మీదుగా సరియా జలపాతానికి చేరుకున్నారు. జలపాతం అందాలను తిలకించి, కొంతసేపు ఆనందంగా గడిపారు. అయితే ఇండుగబిల్లి వరప్రసాద్ అనే యువకుడు డేంజర్ స్పాట్ వద్ద స్నానానికి దిగి, ప్రమాదవశాత్తూ నీటమునిగి గల్లంతయ్యాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించి, సరియా వలంటీర్లు మూడు గంటలపాటు శ్రమించగా గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యమైంది. సరదాగా గడిపేందుకు వచ్చిన తోటి స్నేహితుడు మృత్యువాత పడడంపై ఇద్దరు స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ కె.శంకరరావు ఘటన స్థలానికి చేరుకుని, మృతికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు వరప్రసాద్ విశాఖపట్నం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.