యువతి హత్య
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:16 AM
ప్రియుడి చేతిలో ఓ యువతి హత్యకు గురైంది. ఈ సంఘఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
ప్రియుడే హంతకుడు
మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రాయగడ సమీపంలో పడేసిన వైనం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు
కంచరపాలెం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
ప్రియుడి చేతిలో ఓ యువతి హత్యకు గురైంది. ఈ సంఘఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. భార్యతో కాపురానికి అడ్డుగా ఉందని యువతిని చంపేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి ఒడిశాలోని రాయగడ సమీపంలో పడేశాడు. రాయగడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కంచరపాలెం పరిధి దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్‌కుమార్ (32) కారు డ్రైవర్. అతడి భార్య గర్భం దాల్చడంతో కన్నవారి ఇంటికి వెళ్లింది. ఈ తరుణంలో సురేష్‌కు పెందుర్తికి చెందిన సంధ్య (20)తో పరిచయం ఏర్పడింది. ఆమె తనకు ఎవరూ లేరని చెప్పడంతో సురేష్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆమె అక్కడే ఉండిపోయింది. సంధ్య కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టగా సురేష్ వద్ద ఉందనే విషయం బయటపడింది. దీంతో ఆమెను తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
సురేష్ భార్య మూడు నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఇదిలావుండగా తనను పెళ్లి చేసుకోవాలని సురేష్‌ను సంధ్య కోరింది. తనకు భార్య, పాప ఉన్నారని, పెళ్లి చేసుకునేందుకు వీలు కాదని సురేష్ చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో గత నెల 15న తన ఇంటికి వచ్చి మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన సంధ్యను సురేష్ కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టేసి ఇంట్లో ఉంచి, జగదాంబ జంక్షన్‌కు వెళ్లి ఓ భారీ ట్రాలీ సూట్ కేసును కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. గోనె సంచితో సహా మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఒడిశాలోని రాయగడ బయలుదేరాడు. అక్కడికి సమీపంలోని జేకే పూర్ పరిధి నిర్మానుష్య ప్రాంతంలో గోనె సంచితో సహా మృతదేహాన్ని పడేశాడు. సూట్‌కేసును మాత్రం తిరిగి వెనక్కి తీసుకువచ్చేశాడు. కాగా గోనె సంచిలో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై రాయగడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని గుర్తించి, గురువారం నగరానికి వచ్చి కంచరపాలెం పోలీసులకు విషయం తెలిపారు. నిందితుడి ఇంటికి వెళ్లి అతడి వద్ద గల ట్రాలీ సూట్ కేసును స్వాధీనం చేసుకుని, సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కంచరపాలెం సీఐ కె.రామారావును వివరణ కోరగా ఒడిశాలో జరిగిన కేసు కావడంతో పూర్తివివరాలు తమకు తెలియవన్నారు.