Share News

రష్యాలో చిక్కుకున్న మంగళపాలెం యువకుడు

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:57 AM

ఉపాధి నిమిత్తం రష్యా వెళ్లిన తన కుమారుడు జెట్టి వంశీ అక్కడ ఆర్మీ చేతిలో చిక్కుకున్నాడని అతడి తల్లి అప్పలకొండ ఆందోళన వ్యక్తంచేసింది.

రష్యాలో చిక్కుకున్న మంగళపాలెం యువకుడు

తన కుమారుడిని కాపాడాలంటూ తల్లి ఆవేదన

కూర్మన్నపాలెం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఉపాధి నిమిత్తం రష్యా వెళ్లిన తన కుమారుడు జెట్టి వంశీ అక్కడ ఆర్మీ చేతిలో చిక్కుకున్నాడని అతడి తల్లి అప్పలకొండ ఆందోళన వ్యక్తంచేసింది. అతడిని క్షేమంగా తీసుకురావాలని వేడుకుంటోంది. ఇందుకు సంబంధించి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ సమీపాన గల మంగళపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన జెట్టి అప్పలకొండ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తన కుమారుడు వంశీ, కుమార్తెతో నివాసముంటుంది. రష్యాలో ఉపాధి కల్పిస్తానని వంశీని నాలుగు నెలల క్రితం చోడవరానికి చెందిన ఏజెంట్‌ గంగునాయుడు తీసుకువెళ్లాడు. అందుకు రూ.3.6 లక్షలు తీసుకున్నాడు. వంశీతోపాటు మరో నలుగురు రష్యా వెళ్లారు. అయితే సతీష్‌ అనే వ్యక్తి మాత్రమే తనతో ఉన్నాడని, మిగిలినవారు కనిపించడం లేదని వంశీ వీడియో విడుదల చేసినట్టు అప్పలకొండ తెలిపింది. అక్కడ ఆర్మీ తమను సిపాయిలుగా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పాడని వెల్లడించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు స్పందించి తన కుమారుడిని తీసుకువచ్చేందుకు యత్నించాలని వేడుకుంది. కాగా చోడవరానికి చెందిన ఏజెంట్‌ గంగునాయుడు తొలుత వీరిని నిర్మాణ రంగంలో పనిచేసేందుకు పంపించాడు. అక్కడ నేపాల్‌కు చెందిన వ్యక్తి పరిచయమై ఫుడ్‌ ప్యాకింగ్‌లో పని ఉందని చెప్పి, నెలకు రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పి తీసుకువెళ్లి రష్యా ఆర్మీకి అప్పగించినట్టు తెలిసింది.

Updated Date - Nov 03 , 2026 | 01:57 AM