రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:36 AM
వలసంపేట-రామరాజుపాలెం మధ్య గల టోల్‌గేటు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందాడు.
కొయ్యూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వలసంపేట-రామరాజుపాలెం మధ్య గల టోల్‌గేటు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. వలసంపేటకు చెందిన చదల గణేశ్(28) తల్లిదండ్రులు అనారోగ్యంతో అతని చిన్నతనంలోనే మృతి చెందారు. దీంతో అతనిని గాదిగుమ్మి సమీపంలో ఉన్న పొత్తూరు దేముడు చేరదీసి పెంచుకుంటున్నాడు. కాగా ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో మేకలను మేతకు తీసుకు వెళుతున్నానని గణేశ్‌కు చెప్పి దేముడు వెళ్లిపోయాడు. దేముడుకు చెందిన ద్విచక్ర వాహనానికే తాళం ఉండడంతో దానిపై గణేశ్ రామరాజుపాలెం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వలసంపేట-రామరాజుపాలెం మధ్య గల టోల్‌గేటు వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. గణేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి, అతని సమీప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.