Share News

నువ్వు పంటకు తెగుళ్లు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:44 AM

జిల్లాలో కొద్ది రోజుల నుంచి మంచు ప్రభావం తగ్గుతూ, ఎండ తీవ్రత పెరుగుతుండడంతో నువ్వు పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయని, రైతులు వెంటనే గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సరిత సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో విస్తారంగా వర్షాలు పడడం, మార్కెట్‌లో నువ్వులకు అధిక ధర పలుకుతుండడంతో రబీ సీజన్‌లో పలు మండలాల్లో రైతులు నువ్వు సాగు చేపట్టారని పేర్కొన్నారు.

నువ్వు పంటకు తెగుళ్లు
బూడిద తెగులు సోకిన నువ్వు ఆకులు

వాతావరణ మార్పులతో చీడపీడల బెడద

నివారణ చర్యలు సూచించిన ఆర్‌ఎఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త సరిత

అనకాపల్లి అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొద్ది రోజుల నుంచి మంచు ప్రభావం తగ్గుతూ, ఎండ తీవ్రత పెరుగుతుండడంతో నువ్వు పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయని, రైతులు వెంటనే గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సరిత సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో విస్తారంగా వర్షాలు పడడం, మార్కెట్‌లో నువ్వులకు అధిక ధర పలుకుతుండడంతో రబీ సీజన్‌లో పలు మండలాల్లో రైతులు నువ్వు సాగు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకొన్న మార్పులతో నువ్వు పంటను బూడిద తెగులు, రసం పీల్చే పురుగు, తెల్లనల్లి, వెర్రి తెగులు వంటి ఆశించే అవకాశం వుందన్నారు. బూడిద తెగులు ఆశిస్తే.. ఆకులపై బూడిద వంటి పదార్థం కనిపిస్తుందని, దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడిని లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని ఆమె చెప్పారు. తెల్లనల్లి, పచ్చదోమ, తామర పురుగులు వంటి రసం పీల్చే పురుగులు నువ్వు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుంచి రసాన్ని పీల్చివేస్తాయన్నారు. దీంతో ఆకులు పాలిపోయి, తరువాత ఎండిపోతాయిని పేర్కొన్నారు. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి, ఈనెలు పొడవుగా సాగి కిందివైపునకు ముడుచుకొని దోనె ఆకారంగా మారిపోతాయని, వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ మందును లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు లేదా థైమిధోయేట్‌ 2 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలని తెలిపారు. వెర్రితెగులు పూత దశలో ఆశిస్తుందని, ఈ తెగులు సోకిన మొక్కల్లో పువ్వులోని భాగాలన్నీ ఆకుల్లా మారిపోయి, కాయలు ఏర్పడవని చెప్పారు. ఈ తెగులు దీపపు పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుందని, ఈ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలని, తరువాత థైమిథోయేట్‌ మందును లీటరు నీటికి 3 మిలీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలని ఆమె సూచించారు.

Updated Date - Feb 23 , 2026 | 12:45 AM