మత్స్యగుండంలో యోగాంధ్ర వేడుకలు
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:08 AM
ప్రపంచ యోగా దినోత్సవం ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో సోమవారం పర్యాటక పుణ్యక్షేత్రం మత్స్యగుండంలో యోగాంధ్ర వేడుకలు నిర్వహించారు.
పాడేరు/హుకుంపేట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ప్రపంచ యోగా దినోత్సవం ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో సోమవారం పర్యాటక పుణ్యక్షేత్రం మత్స్యగుండంలో యోగాంధ్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్ విద్యాసాగరరావు నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం థీమ్‌తో మత్స్యగుండంలో యోగాంధ్ర వేడుకలను నిర్వహించామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీవితంలో యోగా ఒక మార్పును తీసుకువస్తుందని, యోగాతో శారీరక, మానసిక ప్రశాంతతోపాటు మనోశక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 17, 20 తేదీల్లో టూరిజం థీమ్‌తో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అంతకు ముందు మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరుడిని కలెక్టర్ నిషాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దర్శించుకున్నారు. వారిని ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, డీపీఆర్‌వో కె.వెంకటరారావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.