Share News

ఘనంగా యోగా దినోత్సవాలు

ABN , Publish Date - May 30 , 2026 | 11:44 PM

జిల్లాలో యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

ఘనంగా యోగా దినోత్సవాలు
అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులకు కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

జూన్‌ 7 నుంచి 21 తేదీ వరకు నిర్వహణ

పాడేరు, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యోగాపై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అందులో భాగంగా జూన్‌ 7న జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, 8న హుకుంపేట మండలం మత్స్యగుండంలో యోగా కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్‌ 21 వరకు నియోజకవర్గం, మండల స్థాయిల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకుల సెల్‌ ఓఎస్‌డీ సమన్వయంతో యోగా దినోత్సవాల ఏర్పాట్లు చేస్తారని, ఆయుష్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ మౌనిక జిల్లా నోడల్‌ అఽధికారిగా వ్యవహరిస్తారన్నారు. మెయిన్‌ మీడియా, సోషల్‌ మీడియాల్లో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ నిషాంతి ఆదేశించారు. యోగా కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, గురుకులం సెల్‌ ఓఎస్‌డీ పీఎన్‌ఎస్‌.మూర్తి, డీపీఆర్‌వో కె.వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:44 PM