Share News

నాలుగు కేంద్రాల్లో యోగా వేడుకలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:41 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఈ నెల 9, 12, 15, 21 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు.

నాలుగు కేంద్రాల్లో యోగా వేడుకలు

నేడు నావెల్‌ కమాండ్‌ ప్లీట్‌ స్పోర్ట్స్‌ మైదానంలో

12న రుషికొండ, 15న గోల్ఫ్‌ క్లబ్‌లో నిర్వహణ

21న భారీ కార్యక్రమం

అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఈ నెల 9, 12, 15, 21 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్స్‌ సర్వీస్‌మెంట్‌ థీమ్‌తో మంగళవారం ఉదయం ఆరు గంటలకు నేవీ ఆధ్వర్యంలో ఫ్లీట్‌ స్పోర్ట్స్‌ మైదానంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. నేవీకి చెందిన 300 మంది, ఎన్‌సీసీ నుంచి 200 మంది, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ విభాగానికి చెందిన 50 మంది, జిల్లా అధికారులు నుంచి మరో 50 మంది...మొత్తం 600 మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వ్యవహరిస్తారన్నారు. అదేవిధంగా ఈ నెల 12, 15 తేదీల్లో జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రుషికొండ, ముడసర్లోవ గోల్ఫ్‌ క్లబ్‌ ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఒక్కో ఈవెంట్‌లో 500 మంది పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, 21న రాష్ట్ర స్థాయి వేడుకల్లో భాగంగా వేయి మందిని భాగస్వాములను చేస్తూ నిర్వహించనున్న కార్యక్రమానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్‌వో ఎం.విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ సత్యవేణి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, టూరిజం అధికారిణి మాధవి, ఆయుష్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.


22న కార్డెలియో క్రూయిజ్‌ నౌక రాక

విశాఖపట్నం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): పర్యాటకులకు సముద్రయానం అనుభవం అందించే కార్డెలియో క్రూయిజ్‌ నౌక ఈ నెల 22న విశాఖ వస్తున్నట్టు ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ విజయమోహన్‌ తెలిపారు. ద్వారకానగర్‌లోని హాలీడే వరల్డ్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రూయిజ్‌లో ప్రయాణించే వారికి ఉచితంగా ఆహారం, ఆల్కహాల్‌ అందిస్తారన్నారు. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లిన తరువాత క్యాసినో కూడా ప్రారంభమవుతుందన్నారు. రాక్‌ క్లైంబింగ్‌ వాల్స్‌, స్పా అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. చెన్నై-విశాఖ-పాండిచ్చేరి-మలేషియా మధ్య ఈ జూన్‌ 22 నుంచి జూలై 13 మధ్య నాలుగు ట్రిప్పులు తిరుగుతుందని ఆయన వెల్లడించారు. ఒక్కో ట్రిప్పులో 1,592 నుంచి 1,950 మంది ప్రయాణాలు సాగించేందుకు అనుగుణంగా వసతులు ఉన్నాయన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 01:41 AM