ప్రకృతి ఒడిలో యోగాసనాలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:22 AM
ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సందర్శనీయ ప్రాంతం జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద ప్రకృతి ఒడిలో యోగాంధ్ర వేడుకలను బుధవారం నిర్వహించారు.
కొత్తపల్లి జలపాతం వద్ద యోగాంధ్ర వేడుకలు
పాడేరు/జి.మాడుగుల, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సందర్శనీయ ప్రాంతం జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద ప్రకృతి ఒడిలో యోగాంధ్ర వేడుకలను బుధవారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్, కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను ఒక భాగంగా భావించి ఆచరించాలన్నారు. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతతో పాటు మనోశక్తి పెరుగుతుందన్నారు. కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర వేడుకలను ట్రైబల్, టెంపుల్ టూరిజం, టూరిజం థీమ్‌లతో నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా టూరిజం థీమ్‌తో కొత్తపల్లి జలపాతం వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహించామని చెప్పారు. కార్యక్రమం అనంతరం కొత్తపల్లి జలపాతం పరిసరాల్లో టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్, జిల్లా కలెక్టర్ నిషాంతి మొక్కలను నాటి నీళ్లు పోశారు. వేదికపై గిరిజన బాలికలు చేసిన యోగాసనాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.హేమలత, జిల్లా గ్రామీణాభివ్ధృద్ధి సంస్థ పీడీ వి.మురళి, టీడబ్ల్యూ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డేవిడ్‌రాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, గురుకుల సెల్ కన్వీనర్ మూర్తి, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, ఎంపీడీవో డేవిడ్‌రాజు, డిప్యూటీ ఎంపీడీవో ఎం.సన్యాసిరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఎంపీపీ అప్పలరాజు, అధిక సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.