Share News

ఉ...అంటారా? ఊ..ఊ..అంటారా??

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:13 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం శుక్రవారం మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్నది.

ఉ...అంటారా? ఊ..ఊ..అంటారా??

గతంలో తిరస్కరించిన అనేక అంశాలను తాజాగా స్టాండింగ్‌ కమిటీ అజెండాలో చేర్చిన అధికారులు

అడ్డుకుంటారా?, ఆమోదించేస్తారా?

నేడే సమావేశం

సభ్యుల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం శుక్రవారం మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్నది. 193 అంశాలతో తయారుచేసిన ప్రధాన అజెండాను ఇప్పటికే సభ్యులకు అందజేయగా, టేబుల్‌ అజెండాగా మరో 60కి పైగా అంశాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా అజెండాలో కొన్ని అంశాలపై సభ్యులు ఎలా నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యోగాంధ్ర సమయంలో బయో టాయిలెట్‌ల ఏర్పాటు కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్టు గతంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశాల అజెండాలో పెట్టగా, సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.16 వేలు చొప్పున అద్దె చెల్లించాలని పేర్కొనడం అసంబద్ధమని, దీని వెనుక పెద్దఎత్తున అవినీతి జరిగినందున ఆయా బిల్లులను చెల్లించేది లేదంటూ తిరస్కరించారు. ఇప్పుడు అవే అంశాలను తిరిగి అజెండాలో చేర్చారు. అలాగే యోగాంధ్ర సమయంలోనే ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలీపాడ్‌ వద్ద కఠినమైన రాళ్లను తొలగించామని, అందుకోసం సుమారు రూ.ఎనిమిది లక్షలు చెల్లించాలని పొందుపరిచాలన్న అంశాన్ని సైతం గతంలో కమిటీ సభ్యులు తిరస్కరించారు ఇప్పుడు దానిని కూడా అజెండాలో చేర్చారు. అదేవిధంగా యోగాంధ్ర కోసం బీచ్‌రోడ్డులో గ్రిల్స్‌కు పెయింటింగ్‌ పనులకు బిల్లులు చెల్లించాలనే ప్రతిపాదనలపై మేయర్‌ పీలా శ్రీనివాసరావు స్వయంగా అభ్యంతరం తెలిపారు. తనకు తెలిసి బీచ్‌రోడ్డులో గ్రిల్స్‌కు పెయింటింగ్స్‌ వేయలేదని, ఒకవేళ వేసినట్టయితే వాటికి సంబంధించిన వీడియోలు చూపించాలని కోరడంతో అధికారులు మౌనం వహించారు. ఆ బిల్లులను కూడా ఇప్పుడు అజెండాలో చేర్చారు. అలాగే భీమిలి జోన్‌లోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (జీటీఎస్‌)లో నామినేషన్‌ పద్ధతిలో ఏడాదికిపైగా పనులు చేయించడాన్ని గతంలో సభ్యులు తప్పుబట్టారు. ఇప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని తిరిగి అజెండాలో చేర్చారు. ఇలా గతంలో తిరస్కరించిన అనేక అంశాలను ఇప్పుడు అజెండాలో చేర్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లతో అవగాహన కుదరడంతో అజెండాలో చేర్చారా?, లేక చివరి సమావేశం కావడంతో ఫైళ్ల క్లియరెన్స్‌ కోసం అధికారులు వాటిని అజెండాలో చేర్చారా?...అనేదానిపై చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగే కమిటీ సమావేశంలో సభ్యులు వీటిపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Updated Date - Mar 13 , 2026 | 01:13 AM