Share News

పసుపు ధర పతనం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:34 AM

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పసుపు ధరలపై పడింది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో గత వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి.

పసుపు ధర పతనం
గిరిజనులు సేకరించిన ఎండు పసుపు

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావమే కారణం

నిలిచిపోయిన విదేశీ ఎగుమతులు

కిలో రూ.130కి ప్రైవేటు వర్తకులు కొనుగోలు

చింతపల్లి/గూడెంకొత్తవీధి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పసుపు ధరలపై పడింది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో గత వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. గిరిజన ప్రాంతంలో పసుపు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కిలో ఎండు పసుపు రూ.140 వరకు ధర పలికింది. ఽప్రస్తుతం రూ.120-130కు పడిపోయింది.

ఏజెన్సీ పదకొండు మండలాల్లో 25 వేల ఎకరాల్లో ఆదివాసీ రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి పచ్చి పసుపు 4.5 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎక్కువ మంది గిరిజన రైతులు పసుపును రెండేళ్ల పంటగా సాగు చేస్తున్నారు. ఈ సాగు విధానం వల్ల నాణ్యత పెరగడంతో పాటు కుర్కుమిన్‌ 5 నుంచి 5.5 శాతం ఉంటుంది. అలాగే ఆదివాసీ రైతులు పసుపును ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంత పసుపు ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ పెరిగింది. పసుపు విక్రయాలు అత్యధికంగా జరిగే ఆసియాలోని మార్కెట్లలో నిజామాబాద్‌ ఒకటి. నిజామాబాద్‌ ధరల ఆధారంగా ప్రైవేటు వర్తకులు గిరిజన ప్రాంతంలో ధరలు నిర్ణయిస్తారు. ప్రధానంగా వడ్డాది వ్యాపారులు గిరిజన ప్రాంత ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. కాగా వారం రోజులుగా ప్రాంతీయ మార్కెట్‌లో కిలో పసుపు రూ.120-130 ధరకు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ సైతం కిలో పసుపును రూ.130 ధరకు కొనుగోలు చేస్తోంది.

Updated Date - Mar 31 , 2026 | 12:34 AM