మెగా డీఎస్‌సీపై వైసీపీ ఆరోపణలు అర్థరహితం
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:26 AM
మెగా డీఎస్‌సీపై వైసీపీ ఆరోపణలు అర్థరహితమని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
పాడేరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్‌సీపై వైసీపీ ఆరోపణలు అర్థరహితమని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్‌సీపై వైసీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలుంటే తక్షణమే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలనే లక్ష్యంతో మెగా డీఎస్‌సీ ద్వారా 16 వేలు పైబడి టీచర్ పోస్టులను భర్తీ చేస్తే, కేవలం అక్కసుతోనే డీఎస్‌సీలో అక్రమాలంటూ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయకపోగా, అధిక సంఖ్యలో టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా ఎంతో పారదర్శకంగా డీఎస్‌సీ ప్రక్రియను చేపట్టి అర్హులైన అభ్యర్థులతో టీచర్ పోస్టులు భర్తీచేసినప్పటికీ కూటమి ప్రభుత్వంపై అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తూ టీచర్లను అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సాగర సుబ్బారావు, బాకూరు వెంకటరమణ, పాంగి పాండురంగస్వామి, త్రినాథ్, బాలకృష్ణ, దీనకుమారి, విజయకుమారి పాల్గొన్నారు.