ముత్తంశెట్టితో వైసీపీ మంతనాలు?
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:33 AM
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండడంతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త నియామకంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది.
పార్టీలోకి తిరిగి వస్తే
భీమిలి సమన్వయకర్తగా నియమిస్తామంటూ ఆఫర్
చిన్న శ్రీను రాజీనామా నేపథ్యంలో
కొండా రాజీవ్ పేరు ప్రకటించాలని
కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించిన జగన్
ఆయనకు కేడర్ సహకరించదని
నేతలు చెప్పడంతో నిర్ణయం వెనక్కి...
ముత్తంశెట్టి రాకుంటే త్రిసభ్య కమిటీ ఏర్పాటు ప్రతిపాదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండడంతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త నియామకంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి సమన్వయకర్తగా పనిచేసిన చిన్న శ్రీను వారం కిందట టీడీపీలో చేరిపోయారు. అయితే జీవీఎంసీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో తక్షణం సమన్వయకర్తను నియమించాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భీమిలి సమన్వయకర్తగా పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ పేరు ప్రకటించాలని కేంద్ర కార్యాలయంలోని ముఖ్య నేతలను నాలుగు రోజుల కిందట జగన్ ఆదేశించారు. అయితే తర్వాత ఏమైందోగానీ రాత్రి 11.30 గంటల సమయంలో భీమిలి సమన్వయకర్త మినహా జగన్ ఆదేశించిన మిగిలిన రెండు పదవులకు ఆయా నేతల పేర్లు (విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు) కేంద్ర కార్యాలయం ప్రకటించింది. కొండా రాజీవ్‌ను నియమిస్తే స్థానికంగా ఉన్న క్యాడర్ సహకరించదని, అక్కడ పార్టీలో సీనియర్లు ఉన్నందున వారందరినీ కలుపుకుని వెళ్లాలంటే సీనియర్ నాయకుడిని మాత్రమే సమన్వయకర్తగా నియమించాలని జిల్లాకు చెందిన కొందరు నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలోని నేతలతోపాటు జగన్‌కు ఫోన్‌లో వివరించినట్టు తెలిసింది. దీంతో భీమిలి మినహా విజయనగరం జిల్లాకు సంబంధించిన రెండు పదవులకు పేర్లు ప్రకటించాలని జగన్ సూచించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ముగ్గురు నేతలతో సమన్వయ కమిటీనా? అవంతిని చేర్చుకోవడమా?
కొండా రాజీవ్ పేరును వెనక్కి తీసుకోవడంతో నియోజకవర్గంలో ఎక్కువ బంధుత్వం కలిగిన బొత్స కుటుంబంలోని వారికి బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు కోరుతున్నట్టు తెలిసింది. అయితే మళ్లీ అదే కుటుంబానికి బాధ్యతలా? అని పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి రగిలే అవకాశం ఉంటుందనే భయంలో అధిష్ఠానం ఉంది. అలాకాకుండా 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకుని సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తంచేసినట్టు తెలిసింది. ముత్తంశెట్టితో ఈ విషయమై చర్చించి ఆయన సుముఖంగా ఉంటే తాడేపల్లి తీసుకురావాలని స్థానిక నాయకులను అధిష్ఠానం ఆదేశించినట్టు తెలిసింది. ఒకవేళ ముత్తంశెట్టి ముందుకురాకుంటే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో త్రిసభ్య సమన్వయ కమిటీని నియమించాలని భావిస్తున్నట్టు పార్టీలోని కీలక నేతలు చెబుతున్నారు.