కలెక్టరేట్‌లో వైసీపీ రచ్చ
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:37 AM
వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఏకంగా కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. కార్యాలయం పోర్టికోలో బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులు ఇబ్బందిపడ్డారు. గీతం విద్యా సంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని యజమాని శ్రీభరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చేందుకు వైసీసీ నగర అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు వచ్చారు. ఒక అంశంపై ఒకరు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.
‘గీతం’పై విడివిడిగా ఫిర్యాదు చేస్తామంటూ నేతల పట్టు
అందరూ కలిసి ఒకటే ఇవ్వాల్సిందిగా సిబ్బంది సూచన
పోర్టికోలో బైఠాయించి నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలు
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు
బందోబస్తులో పోలీసులు విఫలం
విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఏకంగా కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. కార్యాలయం పోర్టికోలో బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులు ఇబ్బందిపడ్డారు. గీతం విద్యా సంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని యజమాని శ్రీభరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చేందుకు వైసీసీ నగర అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు వచ్చారు. ఒక అంశంపై ఒకరు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. అయితే వైసీపీ నేతలు విడివిడిగా తమ ఆధార్ నంబర్, ఫోన్ నంబరుతో ఫిర్యాదును కలెక్టరేట్ సెల్లార్‌లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ కౌంటర్‌లో నమోదు చేయించుకున్నారు. ఒకే అంశంపై వేర్వేరుగా అర్జీలు ఇవ్వనవసరం లేదని, అందరూ కలిసి ఒకటి ఇస్తే సరిపోతుందని కౌంటర్‌లో సిబ్బంది ఒకరు సూచించారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు అక్కడే పోర్టికోలోని కలెక్టర్ కారు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. అప్పటికే అర్జీలు ఇచ్చేందుకు వచ్చినవారు ఇబ్బందిపడ్డారు. పోలీసులు వచ్చి పోర్టికోలో ఆందోళన వద్దని నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో మరికొందరు సీఐ, ఎస్‌ఐలు వచ్చి మరోసారి వైసీపీ నేతల వద్దకు వెళ్లి చర్చించారు. అర్జీదారులు ఇచ్చే ఫిర్యాదులు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, తదితరులు పీజీఆర్‌ఎస్ హాలులోనికి వెళ్లి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్‌కు గీతంపై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ముందుగా అప్రమత్తమై ఉంటే కలెక్టరేట్ పోర్టికో వద్ద వైసీపీ నేతల ఆందోళన నిర్వహించేందుకు ఆస్కారం ఉండేది కాదు. ఈ విషయంలో పోలీసులు పక్కాగా వ్యవహరించలేదనే విమర్శలు వినిపించాయి.