వైసీపీ నేత భూ మేత
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:25 AM
అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆనందపురం మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాకు తెగబడ్డారు.
మాజీ ఎమ్మెల్యే బరితెగింపు
తమ భూములకు రహదారి కోసం ప్రభుత్వ భూమి కబ్జా
కొండలను దొలిచి, గెడ్డలను కప్పి రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం
కళ్లు మూసుకున్న రెవెన్యూ యంత్రాంగం
స్థానికుల ఫిర్యాదుతో కదలిక
ఆ భూములు గతంలో గిరిజనుల వద్ద ఓ వైసీపీ సర్పంచ్ కొనుగోలు
ఐదేళ్ల క్రితం చేతులు మారిన వైనం
వాటిల్లోనూ ప్రభుత్వ భూములు ఉన్నట్టు ఆరోపణలు
ఆనందపురం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజోతి):
అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆనందపురం మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాకు తెగబడ్డారు. కొండలను తొలిచి, గెడ్డలను పూడ్చి తమ భూములకు దర్జాగా రహదారి నిర్మించుకున్నారు. అడ్డుకోవలసిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని ఒక సర్పంచ్ (వైసీపీ) నాలుగు కొండల నడుమ గల కుసులువాడ పంచాయతీ ఇచ్ఛాపురం గ్రామంలో గిరిజనులను అదిరించి, బెదిరించి కొన్నేళ్ల క్రితం వారి భూములను (సుమారు 15 ఎకరాలు) కొనుగోలు చేశారు. ఆ చుట్టుపక్కల గల ప్రభుత్వ భూములను, గెడ్డలను కూడా కలిపేసుకున్నానే ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఆ భూములను అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ)తో పాటు నెల్లూరు జిల్లా వాసి కొనుగోలు చేశారు. లేఅవుట్ వేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఆ భూములకు సరైన దారిలేదు. కొద్దికాలం కిందట పక్కనున్న అటవీ భూమిలో రోడ్డు వేసేందుకు యత్నించడంతో కేసు నమోదు వరకూ వెళ్లింది. అయినా వెనక్కి తగ్గకుండా నెల రోజులుగా దాని పక్కనున్న సర్వే నంబరు 37లో గల కొండను తొలిచి, గెడ్డలను పూడ్చి సుమారు 80 అడుగుల రోడ్డును నిర్మించేశారు. ఆ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీ అనుమతులు లేకపోవడం గమనార్హం. కూటమి పాలనలో వైసీపీ నాయకులు బరితెగించి ప్రభుత్వ భూమి కబ్జా చేయడం విస్తుగొలుపుతుంది. కాగా కొంతమంది స్థానికులు అందించిన సమాచారం మేరకు శుక్రవారం రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. పెద్దఎత్తున కొండను తవ్వి రోడ్డు నిర్మించినట్టు నిర్ధారించారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ శ్రీనుబాబును వివరణ కోరగా పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూపరంగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
భూ కబ్జా చేయడానికి చూస్తున్నారు.
లక్ష్మి, గ్రామస్థురాలు
రోడ్డు నిర్మాణం కోసం తన భూమిని విక్రయించలేదని కబ్జా చేయడానికి చూస్తున్నారని గ్రామానికి చెందిన వరపుల లక్ష్మి ఆరోపించారు. తమకు పెద్దల వద్ద పలుకుబడి ఉందని, అవసరమైతే భూమిలో నుంచి వెళ్లగొడతామని బెదిరిస్తున్నారని వాపోయింది. వారి నుంచి రక్షణ కల్పించాలని కోరింది.