వైసీపీ ఫ్లాప్ షో
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:37 AM
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు లేక వెలవెలబోయింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్’లో వ్యాఖ్యలను వెనక్కితీసుకోవడంతోపాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ప్రధాన కార్యాలయాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం నేతలను ఆదేశించిన విషయం తెలిసిందే.
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు ధర్నాకు
ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి 500 నుంచి
1,000 మందిని సమీకరించేందుకు యత్నం
వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు,
సోషల్ మీడియాలో ప్రచారం
అంత హడావిడి చేసినా
150-200 మందికి మించని వైనం
‘ఆంధ్రజ్యోతి’ ముందు నిరసన కావడంతో
నేతలు, కార్యకర్తలు ముఖం చాటేశారని
ముఖ్య నేతల నిట్టూర్పు
విశాఖపట్నం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు లేక వెలవెలబోయింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్’లో వ్యాఖ్యలను వెనక్కితీసుకోవడంతోపాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ప్రధాన కార్యాలయాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం నేతలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అక్కయ్యపాలెంలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు చేపట్టే నిరసన కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు, కార్యకర్తలంతా తరలిరావాలంటూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి సగటున వెయ్యి మంది చొప్పున సమీకరణ చేయాలంటూ టార్గెట్లు విధించారు. బుధవారం ఉదయం పది గంటల తర్వాత నేతలు ఒక్కొక్కరు ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి వంద మీటర్లు దూరంలో ఉన్న పోర్టు ఆస్పత్రి జంక్షన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. పదకొండు గంటలయ్యేసరికి మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, పసుపులేటి బాలరాజు, పార్టీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.సుభద్ర, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కె.సతీష్‌తోపాటు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు కలిపి మొత్తం 150 నుంచి 200 మంది అయ్యారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సుమారు 35 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి ఎటు నుంచి వచ్చినవాళ్లు అటువైపు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ ముఖ్య నేతలు అంతర్గతంగా మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం అనేసరికి కొందరు నేతలతోపాటు కార్యకర్తలు కూడా ముఖం చాటేశారని, అందువల్లే ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోయామని వ్యాఖ్యానించడం కొసమెరుపు.