వైసీపీ అభాసుపాలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 01:03 AM
డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్ జీ రిలే నిరాహారదీక్షల్లో ఎక్కడా విద్యార్థులు, యువత కనిపించలేదు.
జెన్ జీ పేరిట చేపట్టిన నిరాహార దీక్షల్లో ఎక్కడా కనిపించని యువత
కార్యకర్తలు, సమీకరించిన వృద్ధులతోనే మూడు రోజుల పాటు తతంగం నడిపించిన నాయకులు
విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్ జీ రిలే నిరాహారదీక్షల్లో ఎక్కడా విద్యార్థులు, యువత కనిపించలేదు. కార్యకర్తలతోపాటు సమీకరించిన వృద్ధులు, మహిళలతో శిబిరాలను నింపేసి పార్టీ కార్యక్రమం మాదిరిగా దీక్షలను నేతలు ముగించేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేమీ లేదని, ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే జరిగిందని, దీనిపై చర్చకు రావాలంటూ స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, నాయకులు సవాల్ చేసినా వైసీపీ నేతలు స్పందించలేదు. కానీ, తమ మొండి వాదదను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే సీబీఐ విచారణ కోరుతూ డీఎస్సీలో అన్యాయానికి గురైనవారు, విద్యార్థులు జెన్‌జీ రిలే నిరాహారదీక్ష పేరుతో మూడు (ఈనెల ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో) రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇందుకోసం నియోజకవర్గాల్లో టెంట్‌లు వేయించారు. అయితే ఒకటి, రెండుచోట్ల ఇద్దరు, ముగ్గురు యువకులు తప్పితే ఎక్కడా విద్యార్థులు, యువతీయువకులు ముందుకురాకపోవడం వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలే మూడు రోజుల దీక్షలను ముగించేశారు. జెన్‌జీ అంటే 50 ఏళ్లు పైబడిన పార్టీ నేతలు, కార్యకర్తలు, డబ్బులిచ్చి తీసుకొచ్చిన వృద్ధులా?...అని దీక్షా శిబిరాలను చూసినవారు ఎద్దేవా చేయడంతో ‘ఏం సమాధానం చెప్పాలో కూడా దిక్కుతోచలేదంటూ’ ఆ పార్టీ నేతలు వాపోతుండడం విశేషం.
కేటరింగ్ కోసమని తీసుకొచ్చారు
సింహాచలం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
తమ అధినేత ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ నేతలు జీవీఎంసీ 98వ వార్డు పరిధిలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో డీఎస్సీ అంటే ఏమిటో కనీస పరిజ్ఞానం కూడా లేని యువకులను కూర్చోబెట్టడం చర్చనీయంశంగా మారింది. శిబిరంలో కూర్చున్న వారిలో ఐదారుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో మీడియా ప్రశ్నించగా తమను కేటరింగ్ పేరుతో తీసుకువచ్చారని, రూ.400 చొప్పున ఇస్తామన్నారని చెప్పారు.