Share News

మునిసిపాలిటీ అప్‌గ్రేడ్‌ను అడ్డుకున్న వైసీపీ

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:33 AM

నర్సీపట్నం మునిసిపాలిటీని ప్రథమ శ్రేణిగా అప్‌గ్రేడ్‌ చేయకుండా వైసీపీ నాయకులు ఉద్దేశ పూర్వంగా అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఆరోపించారు.

మునిసిపాలిటీ అప్‌గ్రేడ్‌ను అడ్డుకున్న వైసీపీ

అజెండాలోని అంశాన్ని ఆమోదించడం లేదంటూ చైర్‌పర్సన్‌ సంతకం

టీడీపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌ ధ్వజం

నర్సీపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం మునిసిపాలిటీని ప్రథమ శ్రేణిగా అప్‌గ్రేడ్‌ చేయకుండా వైసీపీ నాయకులు ఉద్దేశ పూర్వంగా అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఆరోపించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 17 జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ పాలకవర్గంం చివరి సమావేశంలో గ్రేడ్‌-3లో వున్న మునిసిపాలిటీని గ్రేడ్‌-1కి అప్‌గ్రేడ్‌ చేయాలని అజెండాలో నాలుగో అంశంగా పెట్టారని తెలిపారు. అయితే ఈ అంశాన్ని ఆమోదించడం లేదంటూ చైర్‌పర్సన్‌ సుబ్బలక్ష్మి ఉద్దేశపూర్వంగా సంతకం చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌, వైసీపీ నాయకులు కలిసి రాజకీయ కక్షతో మునిసిపాలిటీ అప్‌గ్రేడ్‌ను అడ్డుకుంటూ, కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం పురపాలక సంఘం వార్షిక ఆదాయం రూ.4 కోట్లు దాటితే మొదటి శ్రేణి మునిసిపాలిటీగా పరిగణిస్తారని, కానీ నర్సీపట్నం మునిసిపాలిటీ వార్షిక ఆదాయం రూ.15 కోట్లు దాటిందని వివరించారు. మునిసిపాలిటీ గ్రేడ్‌ పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు రావడంతోపాటు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ప్రపంచ బ్యాంక్‌ నిధులు మంజూరు చేస్తుందని విజయ్‌ తెలిపారు.


ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు నాగజ్యోతి ఎంపిక

జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన ఉపాధ్యాయిని

రోలుగుంట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. హరియాణా రాష్ట్రంలోని సోనిపట్‌లో ఆదివారం ఎన్‌ఎస్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొన్నారు. వివిధ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులతో పోటీపడిన ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ ఏడాది అక్టోబరు 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఐరోపాలోని పోలాండ్‌ దేశంలో జరగనున్న ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంటారు.నాగజ్యోతి ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక కావడంపట్ల క్రీడా ప్రముఖులు, సహచరులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి పోటీల్లో కూడా సత్తాచాటాలని ఆకాక్షించారు.

Updated Date - Mar 23 , 2026 | 01:33 AM