Share News

అదరహో

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:50 AM

విశాఖ ఉత్సవ్‌ అంగరంగ వైభవంగా సాగుతోంది. రెండో రోజు ఆదివారం వేడుకలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.

అదరహో

  • రెండో రోజు విశాఖ ఉత్సవ్‌కు పోటెత్తిన సందర్శకులు

  • గోకుల్‌ పార్కు నుంచి కురుసుర సబ్‌మెరైన్‌ వరకు సందడి

  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

  • అలరించిన కామాక్షి లైవ్‌ ఇన్‌ కన్సెర్ట్‌

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌ అంగరంగ వైభవంగా సాగుతోంది. రెండో రోజు ఆదివారం వేడుకలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆకృతులు, పుష్పాలంకరణల వద్ద సెల్ఫీలతో సందడి చేశారు. మధ్యాహ్నం మూడు గంటల తరువాత ప్రధాన వేదిక, గోకుల్‌పార్కు వేదిక వద్ద సందడి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫుడ్‌ కోర్టుల వద్ద ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు. గేమింగ్‌ జోన్ల వద్ద చిన్నారులు కేరింతలు కొట్టారు. సాయంత్రం 5.30 గంటల తరువాత గోకుల్‌పార్కులో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సూపర్‌సింగర్‌ ఫేమ్‌ నాయుడు, సెలబ్రిటీ సింగర్‌ సబీహా తమ పాటలతో అలరించారు. కుసుమ హరనాథ్‌ డ్యాన్స్‌ అకాడమీ కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విజ్జు నేతృత్వంలో స్పెషల్‌యాక్ట్‌, రామ్‌ మ్యాజిక్‌ షో అలరించాయి.

ఆర్కే బీచ్‌లో ప్రధానవేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. యుఫో రియా చిత్రంలో రామ రామ పాటకు చిన్నారులతో కలిసి చిత్రంలోని నటీనటులు భూమిక, రోహిత్‌, పృధ్వీ, లిఖిత, విఘ్నేష్‌ డ్యాన్స్‌ చేశారు. అనంతరం కామాక్షి లైవ్‌ ఇన్‌ కన్సెర్ట్‌ సంగీత సాగరంలో ఓలలాడించింది. యుఫోరియా చిత్రబృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో భూమిక కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలోని ఎన్నో వసంతాల పాటను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీని వాసరావు, సీపీ శంఖబ్రతబాగ్చి విడుదల చేశారు.

సందర్శకుల్లో అసంతృప్తి..

ఉత్సవ్‌ నిర్వహణ పట్ల సందర్శకుల్లో అసంతృప్తి పెల్లుబికింది. ఆశించినస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడతో బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ప్రకటించి, 8 గంటల వరకు ప్రారంభించపోవడంతో చాలా మంది వెనుదిరిగారు. రెండోరోజు సినిమా యూనిట్‌ సందడితో సరిపెట్టేశారని వ్యాఖ్యానించారు. కామాక్షి మరుసటి రోజు కార్యక్రమాలపైనా ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

స్టాల్స్‌ నిర్వాహకుల ఇబ్బందులు..

వేడుకల్లో భాగంగా తీరంలో ఫుడ్‌స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి నుంచి స్టాల్‌ సైజును బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేశారు. కానీ కనీస వసతులు కల్పించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పినా రాత్రి ఏడు గంటలు వరకు దీపాలు వెలగకపోవడంతో వ్యాపారం సాగలేదని వాపోయారు. కొన్ని స్టాల్స్‌కు సరిపడా బెంచీలు ఇవ్వలేదని, మరికొన్నింటి వద్ద చార్జింగ్‌ పాయింట్లు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి స్టాల్స్‌ పెట్టినా లాభం లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా స్టాల్స్‌లో ఆహార పదార్థాల ధరలు భారీగానే ఉన్నాయి. దీతో సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మిన్నంటిన సందడి

సాగర్‌నగర్‌: సాగర్‌నగర్‌, రుషికొండకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉత్సవ్‌లో భాగంగా జీవీఎంసీ సిబ్బంది ఎగురవేసిన పెద్ద బెలూన్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద కార్యక్రమాలు వుంటాయని పెద్దసంఖ్యలో తరలివచ్చిన వారితో బీచ్‌రోడ్డు కిక్కిరిసిపోయింది. సాగర్‌నగర్‌ నుంచి ఆర్కేబీచ్‌ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. వినోద కార్యక్రమాలు లేకపోవడంతో తీరంలో కెరటాలతో ఆటలాడేందుకు సందర్శకులు తరలివెళ్లారు.

Updated Date - Jan 26 , 2026 | 12:50 AM