Share News

నిధులున్నా.. మొదలుకాని పనులు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:59 AM

మండలంలోని భోగాపురం సమీపంలో తగరంపూడి గ్రోయిన్‌ వద్ద శారదా నది గట్టు పునర్మిర్మాణ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. గత ఏడాది మొంథా తుఫాన్‌ సమయంలో శారదా నది వరద ఉధృతితో ఇక్కడ గట్టు భారీగా కోతకు గురైంది.

నిధులున్నా.. మొదలుకాని పనులు
భోగాపురం వద్ద కోతకు గురైన శారదా నది గట్టు

కోతకు గురైన శారదా నది గట్టు పునర్నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు

మూడు నెలలు దాటినా పనులు ప్రారంభించని వైనం

ఆందోళన చెందుతున్న రైతులు

చోడవరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భోగాపురం సమీపంలో తగరంపూడి గ్రోయిన్‌ వద్ద శారదా నది గట్టు పునర్మిర్మాణ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. గత ఏడాది మొంథా తుఫాన్‌ సమయంలో శారదా నది వరద ఉధృతితో ఇక్కడ గట్టు భారీగా కోతకు గురైంది. దీనిని పటిష్టం చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు భోగాపురం వద్ద శారదా నది గట్టు సుమారు 50 మీటర్ల మేర భారీ కోతకు గురైంది. దీంతో భోగాపురం పంచాయతీతోపాటు పీఎస్‌పేట, చాకిపల్లి, రామజోగిపాలెం తదితర గ్రామాల రైతులు పంటపొలాలకు వెళ్లడానికి వీలులేకపోయింది. కాగా కోతకు గురైన నది గట్టు, గ్రోయిన్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌రాజు పరిశీలించి.. గట్టు పునర్నిర్మా పనులు త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అధికారుల ప్రతిపాదనల మేరకు మార్చిలో ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే.. నదిలో వరద ఉధృతి పెరుగుతుంది. ఈ లోగా పనులు చేయకపోతే ఈ ఏడాది కూడా కష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జలవనరుల శాఖ ఏఈఈ రూపను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. టెండరు ఖరారైందని, వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించామని చెప్పారు.

Updated Date - Jul 06 , 2026 | 12:59 AM