Share News

అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:08 PM

అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. కలెక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి కృషి
కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ నిశాంతి

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన టి.నిశాంతి

సెల్‌ టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం

పాడేరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. కలెక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పని చేసిన అనుభవంతో జిల్లాలోని గిరిజనులకు మెరుగైన సేవలందిస్తానన్నారు. అలాగే ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, రోడ్లు, కమ్యూనికేషన్‌తో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. అలాగే మహిళా సాధికారత, ప్రజల సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, పూర్వపు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌తో జిల్లాలో స్థితిగతులపై చర్చించానన్నారు. జిల్లాలో పర్యటించి స్థానిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని తెలిపారు.

అమ్మవారి పాదాలు, మోదకొండమ్మ దర్శనం

పాడేరు వచ్చి జిల్లా నూతన కలెక్టర్‌ టి.నిశాంతి ఘాట్‌లోని మోదాపల్లి కూడలి వద్ద అమ్మవారి పాదాలును దర్శించుకుని, నేరుగా పాడేరులోని మోదకొండమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలికి సత్కరించారు. తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లాలో సెల్‌ టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై ఆమె తొలి సంతకం చేశారు. దీంతో ఆమెకు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌వో నీలకంఠం, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:08 PM