Share News

కదం తొక్కిన కార్మికులు

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:19 AM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కదం తొక్కిన కార్మికులు

లేబర్‌ కోడ్‌ల రద్దుకు డిమాండ్‌

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న సంఘాలు

నగరంలో భారీ ర్యాలీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో సరస్వతీ పార్కు జంక్షన్‌ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఆటో, ముఠా, తోపుడు బండ్ల్లు, గిగ్‌ వర్కర్లకు పీఎఫ్‌తో పాటు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఎల్‌ఐసీ యూనియన్‌, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇంటక్‌, ఇఫ్టూ సంఘాల నాయకులు, మునిసిపల్‌ యూనియన్‌, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.


స్టీల్‌ప్లాంటులో కనిపించని సమ్మె ప్రభావం

శత శాతం హాజరైన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు

ఉక్కుటౌన్‌షిప్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో గురువారం కార్మిక సమ్మె ప్రభావం కనిపించలేదు. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నూరు శాతం విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్త సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు కార్మిక సంఘాల నాయకులు ముందుగానే యాజమాన్యానికి నోటీసు ఇచ్చారు. సమ్మె విజయవంతం చేయాలని సభలు, సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులెవరూ ముందుకు రాలేదు. ఉదయం ఐదు గంటలకు కొంతమంది కార్మిక నాయకులు ప్లాంటు ప్రధాన గేటు వద్దకు వచ్చినప్పటికీ విధులకు హాజరయ్యే ఉద్యోగులను అడ్డుకోలేదు. దీంతో ప్లాంటుపై కార్మిక సమ్మె ప్రభావం పడలేదు. కొంతమంది కార్మిక నాయకులు గాజువాకలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 01:28 AM