Share News

శరవేగంగా పనులు

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:03 AM

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఏడో ప్యాకేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో గోదావరి జలాలను ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కాలువలో మిగిలిన పనుల్లో వేగం పెంచారు. ఎలమంచిలి మండలం ఏటికొప్పాక వద్ద నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఆయా ప్రదేశాల్లో పనులు చేస్తున్నారు.

శరవేగంగా పనులు
తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువపై పైపులతో రోడ్డు నిర్మిస్తున్న దృశ్యం. 9ఏకేపీకేఎస్‌కే4 (ఇన్‌సెట్‌లో) అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం.

ఏడో ప్యాకేజీ కింద తాళ్లపాలెం వద్ద భారీ పైపులతో వంతెన నిర్మాణం

గొబ్బూరు నుంచి ఏలేరు కెనాల్‌ వరకు ప్రధాన కాలువ తవ్వకం

వచ్చే నెలలో జిల్లాకు గోదావరి జలాలు?

కశింకోట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఏడో ప్యాకేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో గోదావరి జలాలను ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కాలువలో మిగిలిన పనుల్లో వేగం పెంచారు. ఎలమంచిలి మండలం ఏటికొప్పాక వద్ద నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఆయా ప్రదేశాల్లో పనులు చేస్తున్నారు.

పోలవరం ఎడమ ప్రధానకాలువ పనులను జిల్లాలో మూడు ప్యాకేజీలుగా (ఆరు, ఏడు, ఎనిమిది) చేపట్టారు. ఆరో ప్యాకేజీ పాయకరావుపేట పట్టణం తాండవ షుగర్స్‌ సమీపంలో మొదలై ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి అక్విడక్టు వద్ద ముగుస్తుంది. ఏడో ప్యాకేజీ ఇక్కడి నుంచి మొదలై తాళ్లపాలెం వద్ద ముగుస్తుంది. గత టీడీపీ హయాంలో (ఏడేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి) ఆరో ప్యాకేజీలో 70 శాతం, ఏడో ప్యాకేజీలో 85 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎనిమిదో ప్యాకేజీ ( తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువతో అనుసంధానం చేసి స్టీల్‌ ప్లాంట్‌ కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు..) పనులు ప్రారంభం కాలేదు. తరువాత వైసీపీ హయాంలో కనీసం ఐదు శాతం పనులు కూడా పూర్తికాలేదు. పైగా చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కాలువ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఆరో ప్యాకేజీలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో మిగిలిన వంతెనలు, అండర్‌ పాసేజ్‌లు, నడక వంతెనల నిర్మాణం, కాలువలో కొన్నిచోట్ల మట్టి తవ్వకం, సిమెంట్‌ లైనింగ్‌ పనులు రాత్రింబవళ్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆరో ప్యాకేజీతో పోల్చుకుంటే ఏడో ప్యాకేజీలో గతంలో ఒకింత మెరుగ్గానే పనులు పూర్తయ్యాయి. ఎలమంచిలి మండల పరిధిలో కాలువ తవ్వకం, వివిధ రకాల కట్టడాల పనులు చాలావరకు పూర్తి చేశారు. కశింకోట మండలంలో గొబ్బూరు నుంచి తాళ్లపాలెం సమీపంలో ఏలేరు కాలువ వరకు పోలవరం కాలువ తవ్వకం, దార్లపూడి వద్ద అక్విడక్టుకు కాలువ అనుసంధానం, అక్కడక్కడా సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయాల్సివుంది. ఇటీవల ఈ పనులను కూడా ప్రారంభించారు. తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డులో కాలువ దాటే ప్రదేశం వద్ద భారీ పైపులు వేసి ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తున్నారు. ఈ పైపుల ద్వారా 2,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయిన తరువాత ప్రస్తుతం వున్న రోడ్డును తొలగిస్తారు. గొబ్బూరు గ్రామం మధ్య నుంచి పోలవరం కాలువ వెళుతున్నది. దీంతో ఇక్కడ కూడా భారీ పైపులను కాలువలో వుంచి, వాటి మీదుగా రోడ్డు వేస్తున్నారు. గొబ్బూరు నుంచి తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువ వరకు పోలవరం ప్రధాన కాలువ తవ్వకం పనులు సాగుతున్నాయి. దార్లపూడి నుంచి గొబ్బూరు వరకు కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న సిమెంట్‌ లైనింగ్‌కు మరమ్మతులు, ఇంకా చిన్నాచితకా పనులు చేస్తున్నారు. చివరగా తాళ్లపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువను ఏలేరు కాలువతో అనుసంధానం చేస్తారు. దీంతో వచ్చే నెలలో గోదావరి జలాలు ఎడమ కాలువ ద్వారా తాళ్లపాలెం వరకు, ఇక్కడి నుంచి ఏలేరు కాలువ ద్వారా విశాఖకు చేరతాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 01:03 AM