Share News

అరకు ఘాట్‌లో రక్షణ గోడ పనులు ప్రారంభం

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:52 PM

అరకు ఘాట్‌రోడ్‌లో గాలికొండ ఆంజనేయస్వామి గుడికి బీసుపురం గ్రామానికి మధ్య రక్షణ గోడ పనులు శనివారం ప్రారంభమయ్యాయి.

అరకు ఘాట్‌లో రక్షణ గోడ పనులు ప్రారంభం
అరకులోయ ఘాట్‌రోడ్‌లో బీసుపురం సమీపంలో రక్షణగోడ నిర్మాణ పనులు ప్రారంభమైన దృశ్యం.

వారం రోజుల్లో పూర్తి చేసేందుకు జాతీయ రహదారి అధికారుల చర్యలు

రూ.40 లక్షలతో ప్రతిపాదనలు

అనుమతులు రాకముందే కాంట్రాక్టర్‌తో పనులు

ఐదు రోజులుగా ఘాట్‌ రోడ్డులో నిలిచిన రాకపోకలు

అరకులోయ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

అరకు ఘాట్‌రోడ్‌లో గాలికొండ ఆంజనేయస్వామి గుడికి బీసుపురం గ్రామానికి మధ్య రక్షణ గోడ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఆర్నబ్‌ తుఫాన్‌ వర్షాలకు పేకాపిట్‌ వాల్‌తోపాటు రోడ్డు అంచు వరకు లోయలోకి జారిపడిపోవడంతో ఘాట్‌రోడ్‌లో భారీ వాహనాలు, ఆర్‌టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో కాంక్రీట్‌ రక్షణ గోడ నిర్మాణ పనులను హైవే ఇంజనీరింగ్‌ అధికారులు చేపట్టారు. లోయలోకి ఎక్స్‌కవేటర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫృధ్వీ కన్‌స్ట్రక్షణ్‌ కంపెనీ కార్మికులు తాళ్ల సాయంతో లోయలోకి దిగి పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం రూ.40 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపామని హైవే ఏఈఈ రఘు, కాంట్రాక్టర్‌ బుల్లిబాబు తెలిపారు. హైవే డీఈఈ సురేశ్‌కుమార్‌ ఎన్నికల్లో విధులో ఉన్నందున ఆయన సూచనల మేరకు తాము దగ్గరుండి పనులు చేయిస్తున్నామన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదిక పనులు చేస్తున్నామన్నారు. పంపిన ప్రతిపాదనలకు అనుమతులు రాకముందే అత్యవసరమైనందున కాంట్రాక్టర్‌తో ముందుగానే పనులు చేయిస్తున్నట్టు ఏఈఈ రఘు తెలిపారు. కాగా ఘాట్‌లో గత ఐదు రోజులుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పర్యాటకుల వాహనాలకు కూడా అనుమతించడం లేదు. దీంతో త్వరితగతిన పనులు చేసేందుకు జాతీయరహదారుల అధికారులు చర్యలు తీసుకున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 10:52 PM