సెల్ టవర్ల పనులను వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:43 AM
జిల్లాకు మంజూరైన సెల్ టవర్ల ఏర్పాటు పనులను వెంటనే మొదలుపెట్టి వేగంగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
పాడేరురూరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన సెల్ టవర్ల ఏర్పాటు పనులను వెంటనే మొదలుపెట్టి వేగంగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన టెలికం నెట్‌వర్క్ సేవలను అందించేందుకు చేపడుతున్న టవర్ల నిర్మాణాలు, భూ సేకరణ పనులపై సంబంధిత నెట్‌వర్క్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో గురువారం ఉదయం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ పనులు, వాటి సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి అధికారులు నివేదికలను త్వరగా సమర్పించాలని ఆమె ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా క్లియరెన్స్ వచ్చిన ప్రదేశాల్లో పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జియో సంస్థకు సంబంధించిన ఆరు ప్రదేశాలకుగాను రెండు ప్రదేశాల్లోనే పనులు ప్రారంభించారని, టవర్ల వారీగా అధికారులు సమీక్షించుకొని మంజూరైన టవర్ల నిర్మాణం ఏ దశల్లో ఉందో పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ంజనీరింగ్ శాఖల ప్రతిపాదన ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నారు. టవర్ల నిర్మాణానికి స్థల సమస్య ఉన్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను చూపించాలని అధికారులకు సూచించారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, గ్రామ సర్వేయర్ సంయుక్తంగా క్షేత్రస్థాయికి వెళ్లి పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. రహదారి సదుపాయం లేని ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించే అంశంపై బీఎస్‌ఎన్‌ఎల్, జియో డీజీఎంలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.