Share News

కాంట్రాక్టర్లుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు!

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:12 AM

జీవీఎంసీ ఎలక్ర్టికల్‌ విభాగంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కొందరు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు.

కాంట్రాక్టర్లుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు!

వీధి దీపాల నిర్వహణలో అవినీతి

నిర్వహణ కాంట్రాక్టర్‌ నుంచి సబ్‌ కాంట్రాక్టులు తీసుకుంటున్న వైనం

లైట్లు వెలగకపోయినా వెలుగుతున్నట్టు తప్పుడు నివేదికలు

బిల్లు చెల్లింపునకు సంపూర్ణ సహకారం

చోద్యం చూస్తున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఎలక్ర్టికల్‌ విభాగంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కొందరు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. నగరంలో వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూడాల్సిన బాధ్యతలను విస్మరించి, నిర్వహణ చూసే కాంట్రాక్టర్‌ వద్ద సబ్‌ కాంట్రాక్టులు తీసుకుని, జేబులు నింపుకుంటున్నారు. దీపాలు వెలగకపోయినా వెలుగుతున్నట్టు అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి బిల్లులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

జీవీఎంసీ పరిధిలో సుమారు 1.18 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజూ సక్రమంగా వెలిగేలా చూడడంతో పాటు సమస్య తలెత్తితే మరమ్మతులు చేపట్టే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇందుకోసం ప్రతినెలా సుమారు రూ.కోటి వరకు వెచ్చిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎన్‌ఆర్‌ సంస్థ వీధి దీపాల నిర్వహణకు జీవీఎంసీతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ నేరుగా నగరంలో బాధ్యతలను చేపట్టకుండా గతంలో ఈఈఎస్‌ఎల్‌లో పనిచేసిన ఓ ఉద్యోగికి సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చినట్టు సమాచారం. దీనిపై జీవీఎంసీ అధికారులకు సమాచారం, ఫిర్యాదు లేకపోవడంతో దృష్టిపెట్టలేదు. వీధిదీపాలు సక్రమంగా వెలిగించేలా కాంట్రాక్టర్‌ను పర్యవేక్షించడం, ఎక్కడైనా వెలగకపోతే 48 గంటల్లోగా సమస్యను పరిష్కరించేందుకు వీలుగా జీవీఎంసీ ఎలక్ర్టిక్‌ విభాగంలో 69 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీధి దీపాలతోపాటు జీవీఎంసీ భవనాలు, సామాజిక భవనాలు, ఫంక్షన్‌హాళ్లు, పార్కుల్లో విద్యుత్‌ సరఫరా, లైట్లు వెలిగేలా కాంట్రాక్టర్‌ ప్రతినిధులతో వారు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. లైట్లు వెలగకపోతే కాంట్రాక్టర్‌తో పాటు అధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కాసుల కక్కుర్తితో...

ఈ నేపథ్యంలో కొంతమంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టర్‌ (సబ్‌కాంట్రాక్టర్‌)తో మిలాఖత్‌ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగిస్తే, వెలగకపోయినా బిల్లుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చి సబ్‌కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తుతున్నారని ఇంజనీరింగ్‌ విభాగం అధికారులే ఆరోపిస్తున్నారు. దీనివల్ల నగరంలో సుమారు 25 శాతం మేర లైట్లు వెలగకపోయినా, అధికారిక లెక్కల్లో 95 శాతం వరకు వెలుగుతున్నట్టు పేర్కొంటున్నారని సమాచారం.

తప్పుడు నివేదికలు

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కాంట్రాక్టు తీసుకున్న ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోయినా వెలుగుతున్నట్టు నివేదిక ఇస్తున్నారని, ఎవరైనా జీవీఎంసీ కమిషనర్‌/మేయర్‌కు ఫిర్యాదు చేస్తేనే లైట్లను మారుస్తున్నారని చెబుతున్నారు. దీనిపై కొంతమంది ఇంజనీరింగ్‌ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దీనిపై దృష్టిసారించి వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:12 AM