Share News

తీరు మారదా!

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:28 AM

నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌లో అనారోగ్యకర పరిస్థితులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తీరు మారదా!

హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఆహార పదార్థాలు

కిచెన్‌లలో అపరిశుభ్ర వాతావరణం

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలు

ఐదు ఆహార పదార్థాలు, 14 సామాగ్రి నమూనాలు సేకరణ

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌లో అనారోగ్యకర పరిస్థితులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తుంటే, మరికొన్నిచోట్ల అత్యంత దారుణమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. తాజాగా ఆదివారం ఆహార భద్రత, ప్రమాణాలశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మరోసారి బహిర్గతం అయ్యింది. జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌కంట్రోలర్‌ ఎస్‌కే చక్రవర్తి నేతృత్వంలో పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు జీవీ అప్పారావు, ఆనంద్‌, శ్రీను, సతీశ్‌కుమార్‌ ఆదివారం రామ్‌నగర్‌ ప్రాంతంలోని న్యూ ఫుడ్‌ మాయ, శీనుబాబు కోడి పులావ్‌ బిర్యానీ, సాయి దుర్గా ఫాస్ట్‌ ఫుడ్స్‌, స్పైసీ బిర్యానీ హౌస్‌, బాంబే రెస్టారెంట్‌లలో తనిఖీలు చేశారు. కిచెన్‌లలో అపరిశుభ్ర, అనారోగ్యకరమైన వాతావరణం ఉన్నట్టు గుర్తించారు. సిబ్బంది గ్లౌజులు వినియోగించకపోవడంతోపాటు రక్త మరకలు ఉండడం, దుర్వాసన వస్తుండంతో ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. తయారు చేసిన ఆహార పదార్థాల నమూనాలు ఐదు, తయారీకి వినియోగించిన సామగ్రి నమూనాలు 14 సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆహార పదార్థాల నమూనాల్లో చికెన్‌ బిర్యానీ, కోడి పులావ్‌, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, చికెన్‌ ఫ్రై, చికెన్‌ టిక్కా ఉన్నాయి. ఈ సందర్భంగా ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌కే చక్రవర్తి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నామని, ‘అన్‌సేఫ్‌’ అని ఫలితాలు వస్తే.. సంబంధిత నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.


పెద్దాస్పత్రిలో మందుల కొరత

క్లోపిడాగ్రెల్‌, యాస్పిరిన్‌ మందులు లేవంటున్న సిబ్బంది

బయట షాపుల్లో కొనుగోలు చేసుకుంటున్న రోగులు

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో మందుల కొరత ఏర్పడింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు రాసిచ్చిన మందులు ఇక్కడి ఫార్మశీలో లేకపోవడంతో బయట షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గుండె జబ్బులతో బాధపడే రోగులకు ఇచ్చే క్లోపీ డాగ్రెల్‌, యాస్పిరిన్‌ మందులను నాలుగు రోజులు నుంచి రోగులకు ఇవ్వడం లేదు. కార్డియాలజీ విభాగానికి రోజూ 100 మంది వరకు రోగులు వస్తుంటారు. వీరిలో దాదాపు 90 శాతం మందికి ఈ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, నాలుగు రోజుల నుంచి మందుల సరఫరా లేకపోవడంతో బయట కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనూ ఈ మందులు లేవని, అందువల్లనే కేజీహెచ్‌కు సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. ఇంకా షుగర్‌, కీళ్ల నొప్పుల నివారణకు వినియోగించే కొన్ని రకాల మందులు అందుబాటులో లేవని చెబుతున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 01:28 AM