Share News

తీరు మారదా?

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:38 AM

చోడవరంలో ఈపీడీసీఎల్‌ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ లోవోలేజీ సమస్య కొనసాగుతూనే వుంది. పలుచోట్ల విద్యుత్‌ తీగలను ఆనుకొని వున్న చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో ఈదురు గాలులకు వైర్లు కలిసిపోయి, ఇళ్లల్లో విద్యుత్‌, ఎలక్ర్టానిక్‌ సామగ్రి కాలిపోతున్నాయి. ఇక ఏఈ రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తూ, సమయపాలన పాటించడం లేదని విద్యుత్‌ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

   తీరు మారదా?
చోడవరంలో ఈపీడీసీఎల్‌ కార్యాలయం

విద్యుత్‌ శాఖపై చోడవరం ప్రజల ఆగ్రహం

కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసినా.. తొలగని లోవోల్టేజీ సమస్య

విద్యుత్‌ తీగలను ఆనుకొని వున్న చెట్ల కొమ్మల తొలగింపులో నిర్లక్ష్యం

ఈదురుగాలులకు వైర్లు కలిసిపోయి హైఓల్టేజీ

ఇళ్లల్లో కాలిపోతున్న విద్యుత్తు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు

స్థానికంగా ఉండని ఏఈ.. కొరవడిన పర్యవేక్షణ

చోడవరం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): చోడవరంలో ఈపీడీసీఎల్‌ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ లోవోలేజీ సమస్య కొనసాగుతూనే వుంది. పలుచోట్ల విద్యుత్‌ తీగలను ఆనుకొని వున్న చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో ఈదురు గాలులకు వైర్లు కలిసిపోయి, ఇళ్లల్లో విద్యుత్‌, ఎలక్ర్టానిక్‌ సామగ్రి కాలిపోతున్నాయి. ఇక ఏఈ రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తూ, సమయపాలన పాటించడం లేదని విద్యుత్‌ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చేనాటికి చోడవరంలో ఒకే ఒక్క 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వుండేది. దీనివల్ల లోవోల్టేజీ సమస్య తీవ్రంగా వుంది. చోడవరంలో లోవోల్టేజీ సమస్య నివారణతోపాటు, చుట్టుపక్కల పంచాయతీల్లో విద్యుత్‌ సరఫరా మెరుగునకు లక్ష్మీపురం వద్ద మరో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు పూర్తికావడంతో ఈ ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులు ఎంతో సంతోషించారు. కానీ వారి ఆనందం ఎంత కాలం నిలవలేదు. చోడవరంతోపాటు చుట్టుపక్కల వున్న పంచాయతీల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిస్థాయిలో మెరుగుపడలేదు. అన్నవరం ప్రాంతంలో విద్యుత్‌ తీగలు చెట్ల కొమ్మలకు తగిలి సుమారు 50 ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు ఇతర విద్యుత్తు, ఎలక్ర్టానిక్‌ గృహోపకరణాలు కాలిపోయాయి. విద్యుత్‌ తీగలను ఆనుకొని చెట్లు ఉండడంతో గాలలుకు వైర్లు కలిసిపోయి అధిక ఓల్టేజీ వస్తున్నదని, ఈపీడీసీఎల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక పట్టణ శివారు గాంధీగ్రామం పరిధిలో ఇళ్లపై నుంచి వెళుతున్న విద్యుత్‌ లైన్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. విద్యుత్‌ అధికారులు ప్రత్నామ్యాయ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఆదేశించినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ సమస్యలు కొనసాగుతుండడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా ఉండని ఏఈ

ఈపీడీసీఎల్‌ చోడవరం ఏఈ విశాఖలో నివాసం వుంటూ చోడవరానికి రాకపోకలు సాగిస్తున్నారు. రోజూ ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం నాలుగు గంటలకల్లా తిరుగుముఖం పడుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ కొరవడడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని అంటున్నారు. ఆయా సీజన్‌లలో ముందస్తుగా చేపట్టవలసిన నిర్వహణ పనులు, ఈదురుగాలులకు ఎక్కడైనా విద్యుత్‌ స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేయడంలో, కొత్త మీటర్ల మంజూరులో జాప్యం జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి కాలం ముగిసి వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు కూడా పరిస్థితి మెరుగుపడకపోతే వినియోగదారులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. సమయపాలన పాటించని ఏఈపై ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:39 AM