Share News

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - May 09 , 2026 | 10:37 PM

రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు.

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
విలేకరులతో మాట్లాడుతున్న ఏఎస్సీ నవజ్యోతి మిశ్రా

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

అత్యవసర సేవలకు శక్తి యాప్‌

ప్రతీ స్టేషన్‌లో శక్తి బృందం

ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

చింతపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. తమ్మంగుల పంచాయతీ పూతికమెట్టలో భార్య కోనెను హత్య చేసిన భర్త కొర్ర రామారావుకి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఖరారు చేయడం వెనుక పోలీసుల కృషి ఉందన్నారు. ఈ తీర్పు మహిళలను వేధించే వ్యక్తులకు కనువిప్పు కలిగిస్తుందన్నారు. మహిళలను వేధించినా.. హత్యచేసినా.. శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో శక్తి బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్‌హెచ్‌వో, మహిళా కానిస్టేబుళ్లు వారపు సంత, కళాశాల పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్నారు. ఈగల్‌ వ్యవస్థ ద్వారా గంజాయి సాగును శతశాతం నియంత్రించామన్నారు. ప్రస్తుతం ఒడిశా నుంచి గిరిజన ప్రాంతం మీదుగా మైదాన ప్రాంతాలకు గంజాయి రవాణ జరుగుతుందన్నారు. గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి రవాణకు ఆదివాసీలు దూరంగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో చింతపల్లి ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, అన్నవరం ఎస్‌ఐ కె.సాయిరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 10:37 PM