Share News

మహిళా మార్టులు మూత

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:58 AM

డ్వాక్రా మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులతో ‘మహిళా మార్టు’లు ఏర్పాటు చేసి నడిపిన వెలుగు అధికారులు.. ఇప్పుడు వాటిని మూసివేశారు. దీంతో డ్వాక్రా మహిళలు సుమారు రూ.2 కోట్లు కోల్పోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పాలకుల మెప్పుకోసం డీఆర్‌డీఏ అధికారులు చేపట్టిన ఈ విఫల ప్రయోగానికి పెట్టుబడి పెట్టిన మహిళలకు లాభాల మాట అటుంచి, పెట్టుబడిలో కనీసం ఒక్క రూపాయి కూడా తిరిగి చేతికి అందలేదు.

మహిళా మార్టులు మూత
మాడుగులలో మూతపడిన మహిళా మార్టు

డీఆర్‌డీఏ అధికారుల విఫల ప్రయోగం

రూ.2 కోట్ల మేర కష్టార్జితాన్ని కోల్పోయిన డ్వాక్రా మహిళలు

తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌

చోడవరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులతో ‘మహిళా మార్టు’లు ఏర్పాటు చేసి నడిపిన వెలుగు అధికారులు.. ఇప్పుడు వాటిని మూసివేశారు. దీంతో డ్వాక్రా మహిళలు సుమారు రూ.2 కోట్లు కోల్పోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పాలకుల మెప్పుకోసం డీఆర్‌డీఏ అధికారులు చేపట్టిన ఈ విఫల ప్రయోగానికి పెట్టుబడి పెట్టిన మహిళలకు లాభాల మాట అటుంచి, పెట్టుబడిలో కనీసం ఒక్క రూపాయి కూడా తిరిగి చేతికి అందలేదు.

మూడున్నరేళ్ల క్రితం వైసీపీ హయాంలో జిల్లాలోని మాడుగుల, చోడవరం, సబ్బవరం, ఎస్‌.రాయవరం, మాకవరపాలెం మండలాల్లో మహిళా మార్టులను నెలకొల్పారు. ఇందుకోసం ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి రూ.3 వేలకు తక్కువ కాకుండా పెట్టుబడి డబ్బులు వసూలు చేశారు. ఒక్కో మార్టు ఏర్పాటుకు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధులతోనే ర్యాక్‌లు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు. వీటి కోసం ఒక్కో మార్టుకు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. మహిళా మార్టుల నిర్వహణ కోసం డైరెక్టర్లు, సిబ్బందిని కూడా నియమించారు. డ్వాక్రా మహిళలంతా ఈ మార్టుల్లోనే సరుకులు కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. మార్టుల్లో కన్నా గ్రామాల్లోని దుకాణాల్లో తక్కువ రేటుకు సరుకులు అందుబాటులో వున్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక మార్టుల్లో సరుకులు కొనుగోలు చేశారు.

నిర్వహణలోపం, దుర్వినియోగంతో మూతపడిన మార్టులు

మార్టులు ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ అధికారులు వాటిల్లో స్టాకు నిల్వలు, విక్రయాల గురించి పట్టించుకోలేదు. కనీసం పర్యవేక్షణ కూడా చేయలేదు. చోడవరం లాంటి వ్యాపార కూడలిలో కిరాణా హోల్‌సేల్‌ వ్యాపారులు ఎక్కువమంది ఉన్నందున ఇక్కడ మహిళా మార్టు అవసరం లేదని స్థానిక అధికారులు సూచించినా, ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అలాగే ఇతర ప్రాంతాల్లో స్థానిక వ్యాపారుల నుంచి సరుకులు కొనుగోలు మార్టులలో విక్రయించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మార్టులలో పనిచేసే సిబ్బందిపై అజమాయిషీ లేకపోవడం వల్ల సరుకులు పక్కదారి పట్టినట్టు చెబుతున్నారు. ఆరంభంలో లాభదాయకంగా నడిచిన మహిళా మార్టులు... అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం, సిబ్బంది దుర్వినియోగాలతో నష్టాలబాటపట్టాయి. పెట్టిన పెట్టుబడికి, జరిగిన వ్యాపారానికి పొంతన లేకపోవడంతో ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. మాకవరపాలెంలో మినహా మిగిలిన మార్టుల్లో కార్యకలాపాలు సాగడంలేదు. చోడవరం, మాడుగుల, సబ్బవరం, ఎస్‌.రాయవరం మార్టులు మూతపడడంతో డ్వాక్రాు సభ్యులకు పెట్టుబడి డబ్బులు కూడా చేతికి అందని పరిస్థితి ఏర్పడింది. ఈ నాలుగు మార్టులలో సుమారుగా రెండుకోట్ల రూపాయలమేర డ్వాక్రా మహిళలు నష్టపోయారు.

పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వాలి

గూనూరు వరలక్ష్మి, డ్వాక్రా సభ్యురాలు, చోడవరం

మహిళా మార్టు నిర్వహణ కోసం డ్వాక్రా సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయి అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. మార్టుల్లో ఎంత నష్టం వచ్చింది? సరుకులు ఎంత మేర మిగిలాయి? వంటి వివరాలు వెల్లడించాలి. మహిళా మార్టుల నష్టాలకు బాధ్యులైన వారి నుంచి డబ్బులు రికవరీ చేసి, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలి. మహిళా మార్టులపై సమగ్ర విచారణ చేసి నిధులు దుర్వినియోగానికి, నష్టాలకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి.

Updated Date - Mar 13 , 2026 | 12:58 AM