మహిళా మార్టు.. మూన్నాళ్ల ముచ్చటే!
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:51 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల నిధులతో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్టు’లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. సభ్యులకు తెలియకుండా గత ఏడాది సెప్టెంబరు 20న మార్టును మూసివేశారు. అందులో సామగ్రిని సైతం డిసెంబరులో అమ్మేశారు. మొత్తం మీద రూ.37 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు లెక్కలు తేల్చారు.
డ్వాక్రా సభ్యుల నుంచి రూ.32 లక్షలు వసూలు
నాటి వైసీపీ పెద్ద సిఫారసుతో ఉద్యోగుల నియామకం
నెలకు రూ.లక్ష మేర జీతాలు
వ్యాపారం సాగకపోవడంతో మార్టు మూసివేత
రూ.37 లక్షలకుపైగా నష్టాన్ని చూపుతున్న వెలుగు అధికారులు
ఇంటీరియర్ పనుల్లో రూ.4.5 లక్షల మేర అవినీతి
మాడుగుల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల నిధులతో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్టు’లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. సభ్యులకు తెలియకుండా గత ఏడాది సెప్టెంబరు 20న మార్టును మూసివేశారు. అందులో సామగ్రిని సైతం డిసెంబరులో అమ్మేశారు. మొత్తం మీద రూ.37 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు లెక్కలు తేల్చారు. మరోవైపు మార్టులో చేపట్టిన ఇంటీరియర్ పనులకు తాము డబ్బులు ఖర్చు పెట్టామంటూ ఇటు వెలుగు, అటు పంచాయతీ అధికారులు వేర్వేరుగా చెబుతున్నారు. ఈ నెల 8న జరిగిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఈ వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి మాడుగులలో మార్టును ఏర్పాటు చేస్తామని, ఇందుకు పెట్టుబడిగా ఒక్కో సభ్యురాలు నుంచి రూ.200 చెల్లించాలంటూ వెలుగు అధికారులు 2022వ సంవత్సరంలో బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. మండలంలో 1,580 సంఘాలకు చెందిన 15,837 మంది నుంచి రూ.200 చొప్పున రూ.31,67,400 వసూలు చేశారు. పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న సామాజిక భవనంలో మహిళా మార్డు పెట్టేందుకు రూ.15,05,000లతో ఇంటీరియర్, కరెంటు, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఈ పనులను ప్రజ్ఞా ఇంటీరియర్ వర్క్సు వారికి అప్పగించారు. అయిన ఖర్చులను వెలుగు రికార్డుల్లో నమోదు చేశారు. మిగిలిన రూ.16,62,400తో సరుకులు కొనుగోలుచేసి అదే ఏడాది డిసెంబరులో మార్టును ప్రారంభించారు. ఇందులో పనిచేయడానికి డ్వాక్రా మహిళలకు అవకాశం ఇవ్వకుండా అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు 11 మందిని నియమించారు. వారికి నెలకు లక్ష రూపాయల వరకు జీతాలు చెల్లించడం మొదలుపెట్టారు. అయితే మార్టులో అనుకున్నమేర వ్యాపారం జరగపోవడంతో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మార్టు ఏర్పాటులో జరిగిన అక్రమాలు, పొరపాట్లను డ్వాక్రా సభ్యులు ఎమ్మెల్యే బండారు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆయన వెలుగు అధికారులను ఆదేశించారు. కానీ ఆయన ఆదేశాలను అధికారులు పెడచెవిన పెట్టి, మండల సమాఖ్య తీర్మానం లేకుండా గతేడాది సెప్టెంబరు 20న మార్టును మూసివేశారు. అందులోని సామగ్రిని డిసెంబరు నెలాఖరున విక్రయించారు. అయితే మార్టులో చేపట్టిన ఇంటీరియర్ పనులకు రెండు బిల్లు చెల్లింపు వ్యవహారం ఈ నెల 8న జరిగిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో బయటపడింది. మార్టు ఏర్పాటుకన్నా ముందే పంచాయతీ తీర్మానంతో సామాజిక భవనంలో కరెంటు వైరింగ్, పుట్టీ, సీలింగ్ ఫ్యాన్లు, విద్యుత్, టైల్స్, పెయింటింగ్ పనులకు రూ.4.5 లక్షలు వెచ్చించారు. ఈ మేరకు ఎం బుక్‌లో నమోదు చేసి, బిల్లులు కూడా డ్రా చేశారు. అయితే ఇవే పనులు తాము కూడా చేయించినట్టు వెలుగు అధికారులు నిధులు డ్రాచేశారు. అయితే వెలుగు సీసీ పి.సోమేశ్‌కుమార్ మాత్రం.. ఇంటీరియర్ పనులను తామే చేయించామని, టైల్స్ మాత్రమే పంచాయతీ వారు వేశారని తెలిపారు. దీనిపై సర్పంచ్ యడ్ల కళావతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. పంచాయతీ తీర్మానంతో సామాజిక భవనంలో రూ.4.5 లక్షలతో అన్ని పనులు చేశామన్నారు. మార్టు మూసివేతపై ప్రస్తుత ఏపీఎం వి.రమణీ కుమారిని అడగ్గా.. నష్టాల కారణంగా మార్టును మూసివేయాల్సి వచ్చిందని, మొత్తం మీద రూ.37,33,400 నష్టాల్లో వుందన్నారు. ప్రస్తుతం రూ.1.57 లక్షల నగదు మాత్రమే అందుబాటులో వున్నట్టు చెప్పారు.