జయహో గిరి మహిళ!
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:56 AM
అక్షరాలు నేర్వకున్నా... ఆధునిక ప్రపంచ పోకడలు తెలియకున్నా.... కుటుంబ పోషణ, వ్యవసాయ రంగంలో గిరిజన మహిళల పాత్ర ఆదర్శం.
వ్యవ‘సాయం’లో ఆమెదే అగ్ర భాగం
పురుషులకు దీటుగా సేద్యంలో రాణింపు
2026ను ‘మహిళా వ్యవసాయ సంవత్సరం’గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
(పాడేరు, ఆంధ్రజ్యోతి)
అక్షరాలు నేర్వకున్నా... ఆధునిక ప్రపంచ పోకడలు తెలియకున్నా.... కుటుంబ పోషణ, వ్యవసాయ రంగంలో గిరిజన మహిళల పాత్ర ఆదర్శం. మన్యంలో గిరిజనులంతా భూమిపై ఆధారపడి, పంటల సాగే ప్రధాన ఆధారంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో పురుషుల కంటే మహిళలే అధికంగా వ్యవసాయ పనుల్లో మమేకమవుతుంటారు. ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమితి 2026ను మహిళా వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
మన్యంలో బాల్యం నుంచే మహిళలు బాధ్యతలను తలకెత్తుకుంటారు. చిన్నతనంలో తల్లితో కలిసి ఊటగెడ్డలకు వెళ్లడం మొదలు అడవికి వెళ్లి వంట చెరకు తేవడం, వ్యవసాయ పనులో తల్లిదండ్రులకు సహాయ పడడం వారికి అలవాటు. ఇక చిన్న పిల్లల ఆలనా పాలనా చూసేదీ వారే. ఏజెన్సీలో పురుషుల కంటే మహిళలే అధికంగా శ్రమిస్తుంటారు. వరి, రాగుల సాగులో పురుషులు కేవలం దుక్కి పనులు మాత్రమే చేయగా, నాట్లు మొదలుకుని కలుపుతీత, నీళ్లు పెట్టడడం, కోతలు, కట్టల మోత తదితర పనులన్నీ మహిళలే చే స్తారు. కూరగాయలు, బంతిపూల సాగు, కాఫీ, మిరియాలు సేకరణ, శుద్ధి వంటి పనులు మహిళలే చేస్తారు. అడవులకు వెళ్లి వంట చెరకు తెచ్చుకోవడం, అడ్డాకులు, ఉసిరికాయలు, శీతాఫలాలు సేకరించి వారపు సంతల్లో విక్రయించడం వారి బాధ్యతే. కూరగాయలు, పూల సాగులో వీరిదే అగ్ర పాత్ర.
ఆడబిడ్డ పుడితే పండగే
ఇతర ప్రాంతాలకు భిన్నంగా మన్యంలో మహిళలే అన్నింటా ముందుంటారు. తమ కుటుంబలో ఆడబిడ్డ పుడితే గ్రామంలో పండుగ చేసుకుంటారు. గిరిజన సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డకు పెళ్లి చేస్తే వరకట్నాలు ఇవ్వాలనే ఆచారం లేకపోవడంతోపాటు, తమ బిడ్డను ఇస్తున్నందుకు వరుడి కుటుంబీకులే మొగనాలి పేరిట పశు సంపద లేదా బంగారం ఇస్తుంటారు. ఈక్రమంలో తమ కుటుంబంలోకి చక్కగా శ్రమించే ఆడబిడ్డను కోడలుగా స్వీకరించాలని ఏజెన్సీలో ఎక్కువమంది కోరుకుంటారు. మన్యంలో గిరిజన మహిళలకు కుటుంబంలో అఽధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆమె నిర్ణయం మేరకు ఇంటిల్లపాదీ నడుచుకుంటారు. ఇతర ప్రాంతాల్లో మహిళలతో పోల్చితే ఆడంబరాలు, ఆధునిక పోకడలకు దూరంగా, నిద్రలో మినహా నిత్యం శ్రమిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన మహిళలు.
మహిళా దినోత్సవానికి గిరి మహిళలు
చింతపల్లి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఆదివారం నిర్వహించే ప్రపంచ మహిళా దినోత్సవానికి గిరిజన మహిళలు తరలివెళ్లారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల నుంచి 50మంది మహిళలను శనివారం ప్రత్యేక బస్సులో అమరావతి పంపామని వెళ్లారని వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యే మహిళా దినోత్సవంలో గిరిజన మహిళలకు పాల్గొనే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.