చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం
ABN , Publish Date - May 25 , 2026 | 11:47 PM
మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు.
కలెక్టర్ టి.నిషాంతి
అరకులోయ, మే 25 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. అరకులోయలో ‘మహిళల భద్రత- మన బాధ్యత’ అనే అంశంపై ఎస్పీ అమిత్‌బర్దార్ ఆదేశం మేరకు పోలీసులు మూడు మండలాల మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, గర్భిణులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ అమిత్‌బర్దార్ మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో ఇటుకల పండుగ సందర్భంగా రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టి డబ్బులు అడగడం మంచి పద్ధతికాదని, ఆచారం పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టొదన్నారు. బాల్య వివాహాలు చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టరని, దీనికి తోడు తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉంటుందని చెప్పారు. జిల్లా ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు శక్తియాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఏ సమస్య వచ్చినా ఈ శక్తియాప్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసుల సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చలపతి, తదితరులు పాల్గొన్నారు.