పంచాయతీల్లో అతివలదే పైచేయి
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:25 AM
జిల్లాలో 79 పంచాయతీలు ఉండగా, 63 పంచాయతీల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
63 పంచాయతీల్లో మహిళా ఓటర్లు ఎక్కువ
16 పంచాయతీల్లో పురుష ఓటర్లు అధికం
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 79 పంచాయతీలు ఉండగా, 63 పంచాయతీల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 1,62,407 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లు 79,630 మంది, మహిళా ఓటర్లు 82,777 మంది ఉన్నారు. పదహారు పంచాయతీల్లో మాత్రం పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆనందపురం మండలంలో మొత్తం 51,951 మంది ఓటర్లు ఉండగా పురుషులు 25,599 మంది, మహిళలు 26,352 మంది ఉన్నారు. భీమిలి మండలంలో 36,943 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 18,098, మహిళలు 18,845 ఉన్నారు. పద్మనాభం మండలంలో మొత్తం ఓటర్లు 42,388 మంది ఉండగా, వారిలో పురుషులు 20,750 మంది, మహిళలు 21,638 మంది ఉన్నారు. పెందుర్తి మండలంలో 31,125 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 15,182, మంది, మహిళలు 15,943 మంది ఉన్నారు. కాగా పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలను లెక్కించి రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ సెక్షన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నందున విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12861) ఈ నెల 19 నుంచి 20 వరకు విశాఖ నుంచి జడ్చర్ల వరకు, తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (12862) ఈ నెల 19 నుంచి 21 వరకు జడ్చర్ల నుంచి విశాఖకు నడవనున్నాయి. జడ్చర్ల-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలను పాక్షికంగా రద్దు చేశారు.
ప్రైవేటు పాఠశాలల్లో 3,456 మందికి ఉచిత ప్రవేశాలు
వివిధ కారణాలతో 900 మంది సీట్లు రద్దు
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
విద్యా హక్కు చట్టం ప్రకారం లాటరీలో ఉచిత సీట్లు వచ్చిన బాలబాలికలు ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నారు. జిల్లాలో శనివారం వరకు 3,456 మంది ప్రవేశాలు పొందారు. మరో 900 మందికి సీట్లు వివిధ కారణాలతో రద్దు చేశారు. జిల్లాలో సుమారు 650 ప్రైవేటు పాఠశాలల్లో ఆరు వేల వరకు ఉచిత సీట్లు ఉన్నాయి. వీటిని పొందడానికి గత నెలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 8,107 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడత లాటరీలో 4,886 మందికి సీట్లు కేటాయించారు. శనివారం వరకు 3,456 మంది కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మరో 900 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒకటో తరగతిలో చేరే సమయానికి ఐదేళ్లు వయసు పూర్తికానివారు, ఇప్పటికే ఒకటో తరగతి చదువుతూ ఉచిత సీటు కోసం ప్రయత్నించిన పిల్లల దరఖాస్తులు తిరస్కరించారు. తొలివిడత లాటరీలో సీట్లు పొందిన వారిలో ఇంకా ప్రవేశాలు పొందని వారు తక్షణమే పాఠశాలకు వెళ్లి ప్రవేశం తీసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ డా.జె.చంద్రశేఖరరావు సూచించారు. మిగిలిన సీట్లకు వచ్చేవారం రెండోసారి లాటరీ తీసే అవకాశం ఉందన్నారు.