Share News

మహిళలే స్వచ్ఛ సారథులు!

ABN , Publish Date - May 23 , 2026 | 11:46 PM

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యం దశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలే స్వచ్ఛ సారథులు!
సబ్బవరంలో జాతీయ రహదారి పక్కన నిరుపయోగంగా ఉన్న చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం

మహిళా సంఘాలకు చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం

- స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యం దిశగా అడుగులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యం దశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కావడంతో గ్రామైక్య సంఘాల ద్వారా మహిళా సంఘాలకు చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2018 వరకు చెత్త నుంచి సంపద కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించింది. అప్పట్లో వ్యర్థాల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకొని అనేక గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని సాధించాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక చెత్త నుంచి సంపద కేంద్రాలను నిర్వీర్యం చేసింది. కేంద్రాల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో క్రమంగా కేంద్రాలన్నీ మూత పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చెత్త నుంచి సంపద కేంద్రాలకు మళ్లీ పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు ఉండగా, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు 523 వరకు ఉన్నాయి. ఆయా కేంద్రాలలో 1,853 మంది క్లాప్‌మిత్రలు పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో వృథాగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా నేటికీ చాలా వరకు వినియోగానికి దూరంగానే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, ప్రజల్లో కొరవడిన చైౖతన్యం కారణంగా చాలా వరకు కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తెచ్చి ఆదాయ మార్గాలను పెంపొందించే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తేనున్నారు.

మహిళా సంఘాలతో చర్చలు

జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామైక్య సంఘాల సభ్యులతో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు వారితో చర్చించనున్నారు. జిల్లాలో మొత్తం 1,277 గ్రామ సమాఖ్యలు ఉండగా, 39,781 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 4,15,957 మంది సభ్యులున్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొనే మహిళలు స్వచ్ఛ సారథులుగా వ్యవహరిస్తే, ఆ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయనే ఉద్దేశంతో కేంద్రాల పర్యవేక్షణతో పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చే మహిళా సంఘాల సభ్యులకు కేంద్రాల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, సంపద తయారీ కేంద్రాలలో తడి, పొడి చెత్త విభజన, వర్మీ కంపోస్టు తయారీ విధానాలను పర్యవేక్షించేలా శిక్షణ ఇవ్వనున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాలకు చేరేలా ప్రణాళిక అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంపై డీఆర్‌డీఏ పీడీ శచీదేవిని వివరణ కోరగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ కోసం మహిళా సంఘాలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తాయన్నారు. ఇప్పటికే నడుస్తున్న కేంద్రాలతో పాటు వృథాగా ఉన్న కేంద్రాలను పంచాయతీ అధికారుల సమన్వయంతో కలిసి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 11:46 PM