మహిళ హత్య
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:27 AM
ఆరిలోవ సెక్టార్-3 దుర్గానగర్‌లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంచంపై అచేతనంగా పడి ఉన్న ఆమె ముక్కు, చెవి నుంచి రక్తస్రావం కావడం, శరీరంపై బంగారు ఆభరణాలు, ఇంట్లో నగదు కనిపించకపోవడంతో సొత్తు కోసం ఎవరో హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ హర్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్న కాపు రమణకు దుర్గాబజార్ పాత పోలీస్ స్టేషన్ సమీపాన సొంత ఇల్లు ఉంది. రమణ భార్య లక్ష్మి (45) చీటీలు నిర్వహిస్తుంటారు.
శరీరంపై ఉన్న బంగారం,
ఇంట్లో రూ.ఐదు లక్షలు మాయం
మాస్క్, టోపీ ధరించి
ఒకరు ఇంట్లోకి వెళ్లినట్టు
సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తింపు
ఆరిలోవ దుర్గానగర్‌లో ఘటన
ఆరిలోవ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
ఆరిలోవ సెక్టార్-3 దుర్గానగర్‌లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంచంపై అచేతనంగా పడి ఉన్న ఆమె ముక్కు, చెవి నుంచి రక్తస్రావం కావడం, శరీరంపై బంగారు ఆభరణాలు, ఇంట్లో నగదు కనిపించకపోవడంతో సొత్తు కోసం ఎవరో హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ హర్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్న కాపు రమణకు దుర్గాబజార్ పాత పోలీస్ స్టేషన్ సమీపాన సొంత ఇల్లు ఉంది. రమణ భార్య లక్ష్మి (45) చీటీలు నిర్వహిస్తుంటారు. బుధవారం ఉదయం రమణ ఉద్యోగానికి వెళ్లిపోగా, లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న రమణకు మంచంపై పడివున్న భార్య కనిపించింది. చెవి, ముక్కు నుంచి రక్తం కారుతుండడం, ఊపిరి ఆడకపోడంతో మరణించినట్టు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆమెను ఎవరో గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. తన భార్య శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు, చీటీ పాటలు పాడుకున్నవారికి ఇవ్వడానికి ఇంట్లో ఉంచిన రూ.ఐదు లక్షలు నగదు కనిపించడం లేదని రమణ చెప్పడంతో ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలకు బలాన్ని చేకూర్చినట్టయ్యింది. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా...మాస్క్, టోపీ ధరించిన ఒకరు బుధవారం ఉదయం 10.12 గంటల సమయంలో రమణ ఇంట్లోకి వెళ్లి తిరిగి మధ్యాహ్నం 12.35 గంటలకు బయటకు వచ్చినట్టు కనిపించింది. దీంతో లక్ష్మికి తెలిసిన వ్యక్తే అయివుంటారని అనుమానిస్తున్నారు. పక్కింటావిడ పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే లక్ష్మి మాట్లాడారని, ఒంటి గంట ప్రాంతంలో కుమార్తె ఫోన్ చేయగా...కాల్ లిఫ్ట్ చేయలేదని చెబుతున్నారు. క్లూస్ టీమ్ వచ్చి ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రమణ దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి.