Share News

పట్టపగలు మహిళ హత్య

ABN , Publish Date - May 15 , 2026 | 01:33 AM

నగరంలో పట్టపగలు దుండగులు ఒక అపార్టుమెంట్‌లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అక్కయ్యపాలెం 80 ఫీట్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస నగర్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పట్టపగలు మహిళ హత్య

ఇంట్లోకి చొరబడి

కాళ్లు కట్టేసి గొంతు నులిమిన దొంగలు

బంగారు ఆభరణాల కోసమే...

ఘటనా స్థలంలో సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం/సీతంపేట, మే 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పట్టపగలు దుండగులు ఒక అపార్టుమెంట్‌లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అక్కయ్యపాలెం 80 ఫీట్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస నగర్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పీలా చంద్రశేఖర్‌, పార్వతి (55) దంపతులు శ్రీనివాస నగర్‌లో గల పీఆర్‌కే నాగ్‌ఆనంద్‌ రెసిడెన్సీ (ఫ్లాట్‌ నంబర్‌-103)లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం జరగడంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కుమార్తె కూడా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్‌ డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలో పాన్‌షాప్‌ నిర్వహిస్తుండగా, పార్వతి గృహిణి. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చంద్రశేఖర్‌ 3.30 గంటల సమయంలో ఇంటి నుంచి షాపునకు వెళ్లారు. తర్వాత 5.15 గంటల సమయంలో పార్వతి భర్త చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేయగా, ఆయన లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తోటికోడలికి వాట్సాప్‌ కాల్‌ చేసి మాట్లాడారు. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రశేఖర్‌ షాప్‌ మూసేసి ఇంటికి రాగా, తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అంతా వెతగ్గా...బెడ్‌రూమ్‌లో మంచం కింద కాళ్లు కనిపించాయి. ఆమెను పిలిచినా పలకకపోవడం, కాళ్లు చీరతో కట్టి ఉండడంతో అనుమానం వచ్చి బయటకు లాగగా, మెడను వైరుతో బిగించి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్‌ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, పార్వతి మృతదేహం వద్ద కారంపొడి చల్లి ఉండడంతోపాటు, ఆమె కళ్లద్దాలు విరిగిపోయి కనిపించాయి. దొంగలకు, ఆమెకు మధ్య పెనుగులాట జరిగినట్టు అనుమానిస్తున్నారు. పార్వతి ఒంటిపై ఉండాల్సిన బంగారం పుస్తెలతాడు, నల్లపూసలు, ఇతర బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సొత్తు కోసమే ఎవరో హత్యచేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో గల సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది నిందితులదే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలావుండగా అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుల ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, 40 ఫ్లాట్‌లు ఉన్న అపార్టుమెంట్‌ మొదటి అంతస్థులో పట్టపగలే హత్య జరగడం చూస్తుంటే మృతురాలికి తెలిసిన వారిపనే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో బంగారం, నగదు ఉంటుందని భావించి లాకర్‌ తెరవాలని పార్వతిపై ఒత్తిడి చేసి ఉంటారని, ఆమె నిరాకరించడంతో హత్యకు పాల్పడివుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 15 , 2026 | 01:33 AM