ట్యాంకర్ లారీ ఢీకొని మహిళ దుర్మరణం
ABN , Publish Date - May 05 , 2026 | 11:27 PM
జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలికి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందారు.
లంకెలపాలెం, మే 5 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలికి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. జీవీఎంసీ 85వ వార్డు పరిధి గంజిపేటకు చెందిన జి.శివపార్వతి (55) వ్యక్తిగత పనిమీద గాజువాక వెళ్లారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆటోలో తిరిగి లంకెలపాలెం చేరారు. ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుండగా గాజువాక వైపు నుంచి వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొన్నది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. భర్త సత్యనారాయణ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఫార్మా బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సీఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.