మహిళపై కత్తితో దాడి
ABN , Publish Date - May 31 , 2026 | 11:19 PM
పొలానికి వెళుతున్న మహిళపై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మండలంలోని చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామంలో చోటుచేసుకుంది.
పొలానికి వెళుతుండగా అడ్డగించి బంగారు ఆభరణాలు లాక్కున్న దుండగుడు
ప్రతిఘటించడంతో మెడపై గాయపరిచి పరారీ
అరకులోయ, మే 31 (ఆంధ్రజ్యోతి): పొలానికి వెళుతున్న మహిళపై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మండలంలోని చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామానికి చెందిన సాగరజన్ని కరిమ ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఊరి సమీపాన ఉన్న పొలానికి బయలుదేరింది. మార్గమధ్యంలో తలకు మంకీ క్యాప్ ధరించి ఉన్న ఒక దుండగుడు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించాడు. ఆమె ముక్కుకు ఉన్న మూడు బంగారు పోగులు, చెవికి ఉన్న బంగారు దుద్దులను బలవంతంగా లాక్కున్నాడు. రెండో చెవికి ఉన్న బంగారు దుద్దులను లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. అతని చేతి బొటనవేలిని గట్టిగా కొరికేసింది. దీంతో ఆ దుండగుడు కత్తితో ఆమె మెడపై గాయపరిచి పరారయ్యాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో పశువులను మేపుతున్న ఆమె కుమారుడు, మరికొందరు పరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆ దుండగుడు పరారయ్యాడు. ఆమెను వెంటనే 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ మెడపై చేసిన గాయం లోతుగా తెగకపోవడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసి టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర ఆస్పత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శించారు. పొలం పనులకు మహిళలు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.