సాగర్‌నగర్ సమస్యల పరిష్కారమే అజెండాగా...
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:07 AM
శాటిలైట్ టౌన్‌షిప్‌గా మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన సాగర్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా...సమస్యల పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ‘అక్షరం అండగా...’ కార్యక్రమం నిర్వహణ
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
పలు శాఖల అధికారులు హాజరు
కాలనీవాసులు పెద్దసంఖ్యలో రాక
డైనేజీ, రహదారులు, తాగునీటి సమస్యల ప్రస్తావన
పార్కులు అభివృద్ధి చేయాలని వినతి
బస్సు సర్వీస్‌లు పెంచాలని విజ్ఞప్తి
విశాఖపట్నం/సాగర్‌నగర్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
శాటిలైట్ టౌన్‌షిప్‌గా మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన సాగర్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా...సమస్యల పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ఉదయం సాగర్‌నగర్‌లోని టెంపుల్ కాంప్లెక్స్‌లో గల షిర్డీసాయి సాగరేశ్వర ఫంక్షన్‌హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సాగర్‌నగర్ వాసులు పెద్దసంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటినీ సావధానంగా విన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దశల వారీగా పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆయా సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించేందుకు కృషిచేస్తామని పలువురు అధికారులు హామీ ఇచ్చారు.
డ్రైనేజీ వ్యవస్థపై ఆవేదన..
సాగర్‌నగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ప్రాంతంలో 12 పార్కులు ఉంటే 11 అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ దుర్భరంగా ఉందని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు, జిమ్ పరికరాలు ఏర్పాటుచేస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని జీవీఆర్ మూర్తి కోరారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. డ్రైనేజీలో తాగునీటి పైప్‌లైన్‌లు కలిసిపోతున్నాయని పుష్పలత అనే ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సాగర్ నగర్‌లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కోటేశ్వరరావు వాపోయారు. గతంలో 11 బస్సులు తిరిగేవని, ఇప్పుడు మూడు మాత్రమే నడుస్తున్నాయని, సిటీలోకి వెళ్లి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్వర్ణలత అనే ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వేదికపై ఉన్న ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు స్పందిస్తూ ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు తిరుగుతోందని, ఎలక్ర్టిక్ బస్సులు వచ్చిన తరువాత జూలై నుంచి సాగర్‌నగర్‌కు సర్వీసులు పెంచుతామన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.అప్పారావు మాట్లాడుతూ తాము సుమారు వంద మంది వరకు ఉన్నామని, సమావేశాలు నిర్వహించుకునేందుకు భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు స్థానిక బ్యాంకుతో ఉన్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి బి.వెంకటలక్ష్మి అనే ఆమె తీసుకురాగా, సాంకేతిక సమస్య ఉందని, వెంటనే పరిష్కరిస్తామని ఏపీడీ తెలిపారు. అడ్వకేట్ శామ్యూల్ మాట్లాడుతూ సిటీలోకి బస్సు సర్వీసులు సరిగా లేకపోవడంతో గంటల తరబడి విద్యార్థులు రోడ్డుపై నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. బీచ్‌రోడ్డులో సిగ్నల్ పాయింట్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని శివనాగేశ్వరరావు కోరారు. కాలనీలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. ఎండాడ వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుచేయాలని మరికొందరు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారాలు, ఇతర అవసరాలతో సాగర్‌నగర్ వస్తున్న వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేలా చూడాలని నాగేశ్వరరావు కోరారు.
కార్యక్రమంలో ద్వారకానగర్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డీసీపీ వెంకటేశ్వరరావు, మధురవాడ ఇన్‌చార్జి జోనల్ కమిషనర్ శాంతిరాజు, ఏపీఈపీడీసీఎల్ ఏఈ చక్రవర్తి, అండర్ గ్రౌండ్ కేబుల్ ఏఈ అనిల్‌కుమార్, ఏఎంహెచ్‌వో రాజా రవి, విశాఖపట్నం రూరల్ తహశీల్దార్ పాల్ కిరణ్, ఆరిలోవ సీఐ హెచ్ మల్లీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ నాయకుడు చిక్కాల విజయ్, ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్ మేనేజర్ కె.రామకృష్ణారావు, న్యూస్ ఎడిటర్ ఎల్.వి.రామాంజనేయలు, బ్యూరో ఇన్‌చార్జి యర్రా శ్రీనివాసరావు, అడ్వర్టైజ్‌మెంట్ విభాగం మేనేజర్ ఆర్.శ్రీనివాస చక్రవర్తి, సర్క్యులేషన్ ఇన్‌చార్జి బి.సత్యనారాయణ, సీనియర్ స్టాఫ్ రిపోర్టర్లు నాళ్ల ఆదినారాయణ, రెడ్డి వెంకటరావు, ‘ఏబీఎన్’ రిపోర్టర్ ఆర్‌వై నాయుడు, మాజీ కార్పొరేటర్ లొడగల అప్పారావు, ఎనిమిదో వార్డు టీడీపీ, జనసేన అధ్యక్షులు చెట్లుపల్లి సన్యాసిరావు, శేఖరి శ్రీనివాసరావు, సాగర్‌నగర్ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు వి.శ్రీరామవర్మ, సారిపల్లి శ్రీనివాసరావు, కిల్లి శ్యామలరావు, అక్కరబోయిన రాంబాబు, కొండపు ఎల్లయ్యరెడ్డి, లొడగల రామమోహన్, యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.శివకాంత్, తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం
- పుష్పలత, స్థానిక మహిళ
సాగర్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దోమల వ్యాప్తితో రోగాల బారినపడుతున్నాం. కొన్నిచోట్ల మురుగునీటి కాల్వలకు గోడలు కూడా లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒకసారి నా భర్త, ట్యూషన్‌కు వచ్చిన బాబు కూడా కాలువలో పడిపోయారు అదృష్టవశాత్తూ ప్రమాదం జరగలేదు. ఇటువంటి ప్రమాదాలను నియంత్రించేందుకు మురుగునీటి కాల్వలు వద్ద గోడలు వంటివి కట్టాలి. ఈ సమస్యపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తే ఎంతో మంది ప్రజలకు మేలు చేసినట్టు అవుతుంది. అలాగే మంచినీటి పైప్‌లైన్లు మురుగునీటి కాల్వల్లో నుంచి ఉన్నాయి. దీంతో మంచినీరు కలుషితమవుతోంది.