Share News

కొండంత విశ్వాసంతో...

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:53 AM

శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు.

కొండంత విశ్వాసంతో...

గిరి ప్రదక్షిణలో భారీగా పాల్గొన్న యువత, మహిళలు

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఏడాది ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, పక్కనున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు ఎక్కువగా కనిపించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది మహిళలు కలిసికట్టుగా ఆధ్యాత్మిక పాటలు, స్వామి జపం చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకుసాగారు. ‘స్వామి అవకాశం కల్పిస్తున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్నాం. స్వామి దయ ఉన్నంతకాలం వస్తూనే ఉంటాం’ అని పార్వతీపురం ప్రాంతానికి చెందిన రామయ్య అనే వృద్ధుడు పేర్కొన్నారు. ఇప్పటివరకు తొమ్మిది సార్లు గిరి ప్రదక్షిణకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు. తన స్నేహితుడు గడిచిన రెండేళ్ల నుంచి గిరి ప్రదక్షిణకు వస్తున్నాడని, స్వామిని బలంగా కోరుకుని గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కె నెరవేరుతుందని చెప్పడంతో తానూ ఈ ఏడాది ప్రదక్షిణకు వచ్చినట్టు రవికుమార్‌ అనే యువకుడు పేర్కొన్నాడు.

అప్పన్న సామి మహిమ గలోడు

- రంభ పైడమ్మ, పాలకొండ

అప్పన్న సామి మహిమగలోడు. నాకేటీ కోరికలు నేవు. సామి అందరినీ బాగా చూసుకుంతాడు. నాకు ఆరోగ్యమి చ్చినాడు. బాగున్నంత వరకు గిరి పెదచ్చనకు వత్తాను. ఆరు పర్రాలు వచ్చినాను. కాలు బాగుండి నడిత్తే చాలు. ఎవరూ తోడక్కర్నేదు. కొడుకు, కూతురు, ఆల కుటుంబం బాగున్నాది. నాను బాగున్నాను. అంతకంటే ఇంకేటి కావాలి. అందరినీ సామే చూసుకుంటాడు. ఏదో కోరుకుంతే, అది తీరిత్తేనో రావక్కర్నేదు. నమ్మకుముంతే రావచ్చు. సానా మంది అలా వత్తున్నోళ్లే.

శరీరాన్ని కష్టపెడితేనే పాప పరిహారం

- డీవీ రమణ, ఆది లక్ష్మి, గురుద్వార

మనుషులు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. దానికి శిక్షగా శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి. గిరి ప్రదక్షిణ ద్వారా శరీరాన్ని కష్టపెడితే కొంత పాప పరిహారం కలుగుతుందన్నది నా నమ్మకం. గిరి చుట్టూ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయడం అంటే శరీరాన్ని శ్రమకు గురిచేయడమే. దీనివల్ల పాప పరిహారాన్ని పొందే అవకాశం స్వామి కల్పిస్తున్నాడని నమ్ముతా. ఉదయం ఏడు గంటలకు గురుద్వార సమీపంలోని గణపతి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించాను. స్వామి కటాక్షంతో సాయంత్రం ఆరు గంటలకు విజయవంతంగా పూర్తిచేశాం. ఇప్పటివరకు పదిసార్లు గిరి ప్రదక్షిణ చేశాం. ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం.

18 ఏళ్లుగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నా

యు.విజయలక్ష్మి, విజయనగరం

(ఫొటో పీసీ సెంటర్‌లో విజయలక్ష్మి అనే పేరుతో ఉంటుంది)

గత పద్దెనిమిదేళ్లుగా క్రమం తప్పకుండా గిరిప్రదక్షిణ చేస్తున్నాను. గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సంఖ్య గత మూడు, నాలుగేళ్లలో బాగా పెరిగింది. గతంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నిర్మానుష్యప్రాంతాల వద్ద ఒంటరిగా వెళ్లలేక, ఇతర భక్తులు వచ్చిన తర్వాత వారితో కలిసి ముందుకువెళ్లేదాన్ని. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోడ్డుపై ఖాళీలేకుండా భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. ఏర్పాట్లు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి. గత ఏడాది సముద్ర స్నానం కోసం మగ్గును తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు షవర్‌లు అందుబాటులోకి తేవడం చాలా ఉపయోగకరంగా ఉంది. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయం గతంతో పోల్చితే మెరుగ్గానే ఉన్నాయి.

Updated Date - Jul 29 , 2026 | 12:53 AM