Share News

చలి కాలం నేస్తాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:39 PM

మన్యంలో చలి అధికంగా ఉండడంతో అందరికీ ఉన్ని దుస్తులు, రగ్గుల వినియోగం తప్పనిసరి అయింది. దీంతో వాటి విక్రయాలు జోరందుకున్నాయి.

చలి కాలం నేస్తాలు
పాడేరు మెయిన్‌రోడ్డులో ఉన్ని దుస్తుల దుకాణాలు

మన్యంలో జోరుగా ఉన్ని దుస్తుల విక్రయాలు

జిల్లా కేంద్రంతో సహా అన్ని మండల కేంద్రాల్లోనూ దుకాణాలు

పల్లెల్లో రగ్గులు, స్వెట్టర్లను విక్రయించేందుకు బైకులపై వస్తున్న ఉత్తరాది ప్రాంత వర్తకులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో చలి అధికంగా ఉండడంతో అందరికీ ఉన్ని దుస్తులు, రగ్గుల వినియోగం తప్పనిసరి అయింది. దీంతో వాటి విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ప్రతి మండల కేంద్రంలోనూ ఉన్ని దుస్తుల విక్రయాల దుకాణాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన వర్తకులు ప్రతి ఏడాది నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఏజెన్సీలో ఉన్ని దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో రోడ్డు పక్కన తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా, మరి కొందరు వర్తకులు బైకులపై వాటిని పల్లెల్లోకి తీసుకువెళుతూ అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడ చూసినా ఉన్ని దుస్తులు, రగ్గుల వ్యాపారులే దర్శనమిస్తున్నారు.

రెండు నెలలుగా వణికిస్తున్న చలి

మన్యంలో గత రెండు నెలలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో చలి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీంతో ప్రజల దైనందిన జీవనానికి సైతం శీతాకాల వాతావరణం అంతరాయంగా మారింది. ఈ నేపథ్యంలో బయట పనుల నిమిత్తం రాకపోకలు సాగించే వారికి ఉన్ని దుస్తుల వినియోగం తప్పనిసరి అయింది. అలాగే ఇళ్లల్లో ఉండే వారికి రగ్గులు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

కొనుగోలుకు ఎగబడుతున్న పర్యాటకులు

శీతాకాలంలో మన్యానికి వస్తున్న పర్యాటకులు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ఎగబడుతున్నారు. ఇక్కడ చలి నుంచి రక్షణ పొందేందుకు కొందరు కొనుగోలు చేస్తుండగా, మరి కొందరు అరకు, పాడేరు, లంబసింగి టూర్‌ వెళ్లామనే గుర్తుగా వాటికి కొనుక్కుంటున్నారు. ఏది ఏమైనా ఉన్ని దుస్తులకు మాత్రం చక్కని గిరాకీ ఏర్పడింది. అలాగే పురుషులు, మహిళలకు స్వెట్టర్లతో పాటు టోపీలు, గ్లౌస్‌లు, పలు రకాల రగ్గులు వర్తకులు విక్రయిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:39 PM