Share News

సంకల్పమే బలం

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:58 AM

సంకల్పం... కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని, లక్ష్యం చేరేవరకు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ మహిళా సమాజానికి పిలుపునిచ్చారు.

సంకల్పమే బలం

మహిళలు సాధించలేనిదేదీ లేదు

లక్ష్యం చేరే వరకూ వెనక్కి తిరిగి చూడొద్దు

సేవ చేయాలనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా

మహిళలు ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

(అనకాపలి, ఆంధ్రజ్యోతి)

సంకల్పం... కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని, లక్ష్యం చేరేవరకు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ మహిళా సమాజానికి పిలుపునిచ్చారు. ఇందుకు తానే ఉదాహరణ అని ఆమె వివరించారు. తమిళనాడులోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ, సమాజానికి తనవంతు సేవచేయాలనే తపనతో సివిల్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు వేశానన్నారు. వరుసగా రెండుసార్లు అపజయం ఎదురైనా, ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదని, లక్ష్యాన్ని వీడకుండా, ప్రతి అపజయం విజయానికి మెట్టుగా భావించి, విజయ తీరాలకు చేరుకున్నానని వివరించారు. నిరంతర కృషితో 2013లో ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై, ప్రజా పాలనలో అడుగుపెట్టి, 2024 జూలైలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టానన్నారు. అంతకుముందు బాపట్ల కలెక్టర్‌గా, ఏపీ టూరిజం అథారిటీ సీఈఓగా, తూర్పుగోదావరి జిల్లా సబ్‌ కలెక్టర్‌గా పనిచేశానని, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు చేరువచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు.

జీవితాన్ని సవాల్‌గా తీసుకోవాలి

మహిళా సాధికారత చేతల్లో కనిపించాలి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా అన్ని పాత్రలను సమర్థంగా నిర్వహించగలగాలి. లక్ష్య సాధనలో ప్రతి అపజయాన్ని గెలుపునకు మెట్టుగా భావించాలి. ఏ రంగంలో ఉన్నా, సామాజిక సేవ, అంకితభావంతో పనిచేయాలి. జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల్లో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వివరించారు.


‘వసుంధర వెలుగులో’ శ్రీలత

అనకాపల్లి అగ్రికల్చర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ టి.శ్రీలత విశిష్ట గుర్తింపు పొందారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సాయిల్‌ సైన్స్‌ విభాగం ప్రచురించిన వసుంధర వెలుగులు (లుమినరీస్‌ ఆఫ్‌ వసుంధర) కాఫీ టేబుల్‌ బుక్‌లో ఆమెకు స్థానం దక్కింది. సాయిల్‌ సైన్స్‌ విభాగంలో విశేష కృషిచేస్తున్న 20 మంది మహిళా శాస్త్రవేత్తలజీవిత విశేషాలు, సాయిల్‌ సైన్స్‌లో కృషి, సహజ వనరుల అభివృద్ధికి అందించిన సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సహజ వనరుల యాజమాన్యంలో 20 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు శీర్షికన ఈ పుస్తకంలో ప్రచురించారు. శ్రీలతకు గౌరవం దక్కడం పట్ల సహచరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 6న భోపాల్‌లో భారత వ్యవసాయ పరిశోధన మండలి సాయిల్‌ సైన్స్‌ విభాగం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీలత సత్కారాన్ని అందుకున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 01:58 AM