గ్రేటర్‌లో విలీనానికి సమ్మతమే, కానీ...
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:48 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో విలీనానికి జిల్లాలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు సమ్మతి తెలిపాయి.
ఉపాధి పథకం కొనసాగించాలని, పదేళ్లు పన్నులు పెంచవద్దని మెజారిటీ పంచాయతీల తీర్మానం
వీఎల్‌టీ వద్దని, భూముల సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
భీమిలి/పద్మనాభం/ఆనందపురం/పెందుర్తి
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో విలీనానికి జిల్లాలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు సమ్మతి తెలిపాయి. భీమిలి మండలంలో రేఖవానిపాలెంతోపాటు మరో రెండు, మూడు పంచాయతీలు మాత్రం విలీనానికి వ్యతిరేకించాయి. జీవీఎంసీలో పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో గల 79 పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదనపై ఈనెల 25వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే పంచాయతీల విలీనానికి అభ్యంతరం లేదు గానీ పేదల కోసం ఉపాధి హామీ పథకం (ప్రస్తుతం వీబీ-జీ రాంజీ ప్రోగ్రాం) కొనసాగించాల్సిందేనని తీర్మానంలో ప్రజల అభిప్రాయంగా పొందుపరచాలని స్పష్టంచేశారు. అలాగే పదేళ్ల పాటు పన్నులు పెంచరాదని డిమాండ్ చేశారు. ఇంకా ఇనాం భూముల సమస్య పరిష్కరించాలని, వీఎల్‌టీ విధించరాదని కోరారు. గ్రామ సభల్లో కూటమి నేతలతోపాటు వైసీపీ నేతలు విలీనానికి ఆమోదం తెలిపారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన తీర్మానాల మేరకు ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలు ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలతో ముసాయిదా జాబితా విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితా ఆదివారం విడుదల చేస్తారు.
వార్డుల పునర్విభజనలో కదలిక
120 వార్డులతో తుది ముసాయిదా పంపాలని ప్రభుత్వం ఆదేశం
ఇప్పటికే అందిన అభ్యంతరాలను క్రోడీకరించే పనిలో టౌన్‌ప్లానింగ్ విభాగం
అర్ధరాత్రి వరకు కొనసాగిన పరిశీలన
రేపటికల్లా ప్రత్యేక అధికారికి అందజేత
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
హైకోర్టు స్టే విధించడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ మళ్లీ మొదలైంది. 120 వార్డుల సరిహద్దులతో కూడిన తుది ముసాయిదాను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆగమేఘాల మీద కసరత్తు ప్రారంభించారు.
జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులకు పెంచుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా, టౌన్‌ప్లానింగ్ అధికారులు పునర్విభజన చేపట్టారు. వార్డుల సరిహద్దులతో కూడిన ప్రాథమిక ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచడంతోపాటు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే వార్డుల సంఖ్యను 150కి పెంచాలంటూ ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ఒకే ఫార్మెట్‌లో రెండు వేలకుపైగా సూచనలు అందాయి. వార్డు సరిహద్దులు మార్చాలని, డోర్ నంబర్లను మ్యాపింగ్ చేయాలని, ఇతరత్రా మరో 150 వరకూ వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాత పరిగణనలోకి తీసుకోదగ్గ అభ్యంతరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తుది ముసాయిదాను జీవీఎంసీ కమిషనర్ ద్వారా ప్రత్యేక అధికారికి, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వార్డుల పునర్విభజనపై స్టే విధించిన విషయం తెలిసిందే. కోర్టు స్టే విధించడంతో వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు పక్కనపెట్టేశారు. మరోవైపు భీమిలి, ఆనందపురం, పెందుర్తి, పద్మనాభం మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదన రావడంతో జిల్లా రెవెన్యూ అధికారులు ఆ మేరకు గ్రామసభలు నిర్వహించారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవీఎంసీకి ఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చునని కొందరు, అక్టోబరులోగా ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి తీరుతుందని మరికొందరు చెబుతూ వస్తున్నారు. వార్డుల పునర్విభజనపై కోర్టులో కేసు ఉండడంతో గతంలో ఉన్న 98 వార్డులతోనే ఎన్నికలు జరుగుతాయని ఇంకొందరు విశ్లేషణలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సమావేశమై 120 వార్డుల పునర్విభజన ఫైల్‌ను బయటకు తీసి, ప్రజల నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వాటిలో పరిగణనలోకి తీసుకోగదగినవి, అర్హత లేనివి గుర్తించే పనిలోపడ్డారు. శనివారం అర్ధరాత్రి వరకు కసరత్తు జరిపిన అధికారులు ఆదివారం మరోసారి కూర్చుని తుది నివేదిక తయారుచేసి కమిషనర్ ద్వారా సోమవారానికి జీవీఎంసీ ప్రత్యేక అధికారికి పంపించేందుకు ముసాయిదాను తయారుచేస్తున్నారు.