వీఎంఆర్‌డీఏ గాడిన పడేనా?
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:06 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇప్పట్లో గాడిన పడేలా కనిపించడం లేదు.
ఇటీవల కమిషనర్ బదిలీ
ఆ పోస్టులో ప్రఖర్ జైన్ నియామకం
రెండు వారాలైనా బాధ్యతలు చేపట్టని వైనం
ప్రస్తుతం ఉన్న పోస్టు నుంచి ప్రభుత్వం రిలీవ్ చేయలేదని సమాచారం
తాజాగా జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు
పూర్తి స్థాయి అధికారి లేకుంటే కీలక ప్రాజెక్టులు ముందుకుసాగేదెలా..?
విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇప్పట్లో గాడిన పడేలా కనిపించడం లేదు. మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న తేజ్‌భరత్‌ను ఆకస్మికంగా బదిలీ చేసిన ప్రభుత్వం ఆ పోస్టులో ప్రఖర్ జైన్‌ను నియమించింది. రెండు వారాలైంది. ఆయన ఇంతవరకూ ఇక్కడ విధుల్లో చేరలేదు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఆయన కీలకపాత్ర పోషిస్తుండడంతో ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా జీవీఎంసీ కేతన్‌గార్గ్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి వీఎంఆర్‌డీఏపై ప్రభుత్వం అనేక బాధ్యతలు పెట్టింది.
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) బోర్డుకు వీఎంఆర్‌డీఏ కమిషనరే కన్వీనర్. ఈ నెల మొదటి వారంలో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీఈఆర్‌లో భాగంగా అనేక ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. అందులో ముఖ్యమైనది బే సిటీ. అలాగే ఐటీ సిటీ, ఏరో సిటీ. టూరిజం హబ్ వంటివి చేపట్టాలని సూచించారు. పనిభారం ఎక్కువైందని తేజ్ భరత్ అదనంగా అధికారులను నియమించుకున్నారు. అదనపు కమిషనర్‌గా దాట్ల కీర్తిని తెప్పించుకున్నారు. అదనపు కమిషనర్‌గా మరో అధికారిని నియమించుకున్నారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్లను విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు నియమించారు. కమిషనర్ హోదాలో చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడం కష్టం అవుతుందని, చిన్న చిన్న పనులన్నింటిని కలిపి ఒకటే పనిగా పెద్ద కాంట్రాక్టర్లకు అప్పగించడం ప్రారంభించారు. ఇక్కడ తలెత్తిన వివాదాలు ఆయన బదిలీకి దారితీశాయి. అంటే పనులు ఎప్పటిలాగే నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు వీఎంఆర్‌డీఏకి పూర్తిస్థాయి అధికారి కావాలి. అది కూడా అవినీతికి దూరంగా ఉంటూ పరుగులు తీయించేవారై ఉండాలి. దానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా అదనపు బాధ్యతలను మరో ఐఏఎస్‌కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్‌గా ఉన్న మల్లికార్జునను సుమారు 20 నెలలు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా అదనపుగా బాధ్యతలతో కొనసాగించారు. ఆ సమయంలోనే పేదల లేఅవుట్లకు వీఎంఆర్‌డీఏ నుంచి వందల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం పేరిట ఖర్చు చేశారు. ఆ పనులు పూర్తికాకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడంలో అప్పటి అధికారులు కుమ్మక్కు అయ్యారు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం అధికం. పైగా జీవీఎంసీ కమిషనర్ పోస్టు కూడా తెల్లవారి లేచించి మొదలు నగరంలో తిరగడంతోనే సరిపోతుంది. వచ్చే పెట్టుబడిదారుల సదస్సుకు నగరాన్ని ముస్తాబు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు నీటి సమస్య వేధిస్తోంది. అనేక కీలక బాధ్యతలు ఉన్న జీవీఎంసీ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వడం అంటే వీఎంఆర్‌డీఏను ఎలా నడిపినా ఫరవాలేదనే భావన ఉందని అర్థమవుతోంది. ఇప్పటికే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు పూర్తిస్థాయి అధికారిని నియమించాల్సి ఉంది.